భారత్ కు బంగ్లా బిగ్ షాక్..! తాజా అల్టిమేటం..!
బంగ్లాదేశ్ (Bangladesh) లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) సర్కార్ భారత్ కు భారీ షాకిచ్చింది. షేక్ హసీనా సర్కార్ ను కూలదోసిన తర్వాత షేక్ యూనుస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం కొంతకాలం కొనసాగాక.. అక్కడ జరిగిన ఎన్నికల్లో బీఎన్పీ ఘన విజయం సాధించింది. దీంతో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలు మెరుగుపడతాయని భావించిన వారికి నిరాశ తప్పలేదు. తమతో సంబంధాలు కావాలంటే తమ డిమాండ్ కు అంగీకరించాలని బంగ్లాదేశ్ అల్టిమేటం ఇచ్చింది.
భారత్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు కొత్త గంగా జలాల పంపిణీ ఒప్పందంపై ఆధారపడి ఉంటాయని అధికార బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ బీఎన్‌పీ ప్రధాన కార్యదర్శి మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగిర్ స్పష్టం చేసారు. బంగ్లాదేశ్ అంచనాలు, అవసరాలకు అనుగుణంగా భారత్ తో తక్షణ చర్చల ద్వారా ఒప్పందం కుదుర్చుకోవాలని కోరారు. 1996లో కుదిరిన ఇండో-బంగ్లాదేశ్ గంగా జలాల ఒప్పందం ఈ డిసెంబర్‌తో గడువు ముగుస్తున్న నేపథ్యంలో గంగా జలాల పంపిణీ ఒప్పందం లేదా ఫరక్కా ఒప్పందంపై సంతకం కీలకమని బంగ్లా మంత్రి కూడా అయిన అలంగిర్ వెల్లడించారు.

పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా అవామీ లీగ్ హయాంలో కుదిరిన 30 ఏళ్ల గంగా జలాల ఒప్పందం పునరుద్ధరణపై అనిశ్చితి, భవిష్యత్ జలాల పంపిణీ ఏర్పాట్లపై ఆందోళనలు పెంచుతున్నాయని అలంగిర్ ఆరోపించారు. కొత్త ఒప్పందం వచ్చేవరకు ప్రస్తుత ఒప్పందం అమల్లో ఉండాలని, భవిష్యత్ ఒప్పందాలు నిర్ణీత కాలానికి పరిమితం కారాదని ఆయన సూచించారు. వాయువ్య చపాయ్ నవాబ్‌గంజ్ జిల్లా మీదుగా బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించాక 'పద్మ'గా పిలువబడే గంగా నది, డెల్టా దేశానికి ప్రధాన నదీ వ్యవస్థ. భారత్‌లో ఉద్భవించే లేదా ప్రవహించే 54 నదులతో సహా వందలాది నదులు దీన్ని దాటుతాయి. బంగ్లాదేశ్ 170 మిలియన్ల ప్రజలలో దాదాపు మూడింట ఒక వంతు మంది జీవనోపాధి, జీవవైవిధ్యం, అనేక ఉపనదులకు నీటి సరఫరా కోసం ఈ వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని అలంగిర్ తెలిపారు.

తాజాగా బంగ్లాదేశ్ పద్మా నదిపై బ్యారేజీ నిర్మాణానికి భారీ ప్రాజెక్టును ఆమోదించిన మూడు రోజుల తర్వాత బీఎన్‌పీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ బ్యారేజీ, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని ఫరక్కా బ్యారేజీ “ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడంలో” సహాయపడుతుందని బంగ్లాదేశ్ పేర్కొంది. ఈ ప్రాజెక్టు 2033 నాటికి పూర్తవుతుందని అంచనా. మరోవైపు ఫరక్కా బ్యారేజీ ప్రధానంగా కోల్‌కతా ఓడరేవును పరిరక్షించడానికి నిర్మించినట్లు భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. రెండు దేశాల మధ్య కుదిరిన గంగా జలాల పంపిణీ ఒప్పందంతో సహా ద్వైపాక్షిక యంత్రాంగాలు, ఒప్పందాల ద్వారా జలాల పంపిణీ సమస్యలు పరిష్కారం జరిగినట్లు భారత్ స్పష్టం చేస్తోంది.














Click it and Unblock the Notifications