'పట్టు' కోసం వ్యూహం మార్చిన చంద్రబాబు!
మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ కూడా తన రాజకీయాన్ని మార్చుకుంటూ వస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా సహజశైలికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ విషయం స్పష్టంగా అవగతమైంది. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా మీద ఆ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది. మొదటినుంచి ఈ జిల్లాలో టీడీపీకి పట్టు చిక్కడంలేదు. వరుసగా నాలుగు ఎన్నికలను పరిశీలించి చూసినా ఇదే విషయం స్పష్టమవుతోంది.
2014లో మొత్తం 10 నియోజకవర్గాలకు గాను 3 దక్కించుకుంది. 2019 ఎన్నికలకు వచ్చేసరికి అది కూడా లేదు. అన్ని సీట్లలో ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన పార్టీగా ఉన్న సమయంలో ఆ పార్టీదే టీడీపీపై పైచేయిగా ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీదే పైచేయి అవుతోంది. తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ జిల్లాలో ఏళ్ల తరబడి వెనకబడిపోతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే అలాంటి పరిస్థితుల నుంచి తెలుగుదేశం బయటపడిందనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దగ్గరయ్యారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సంగతి తెలిసిందే. అయితే కోటంరెడ్డి, ఆనం కు అధికార పార్టీ ఏమీ చెప్పలేదు. మేకపాటికి మాత్రం ఓటు ఎవరికి వేయాలో చెప్పింది. అయినప్పటికీ వారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వేసినట్లు తెలుస్తోంది. అయితే తాము వేయలేదని మేకపాటి చెబుతున్నారు. వీరిని వైసీపీ.. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసింది. వారు కూడా సస్పెన్షన్ కోసమే ఎదురుచూస్తున్నట్లు వారి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మినహా ఆర్థిక బలం, అంగబలం కలిగి పేరున్న నేతలు లేరు. ఇటువంటి తరుణంలో నెల్లూరు సిటీ, రూరల్, కావలి, ఉదయగిరి, వెంకటగిరి నియోజకవర్గాలను ఈసారి గెలుచుకుంటామని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల్లో టీడీపీ-వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలన్నీ తమ పార్టీకి బాగా కలిసివస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు ఆనందంతో చెబుతున్నారు.












Click it and Unblock the Notifications