అందుకు చంద్రబాబును ఉరితియ్యాలా?: తెలుగు తాలిబన్ పార్టీ అంటూ జోగి రమేష్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రాబు నాయుడుతోపాటు తెలుగుదేశం పార్టీపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని.. తాలిబన్ పార్టీకి చంద్రబాబే అధ్యక్షుడని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబును ఉరితియ్యాలా?
దళితుల్లో పుట్టాలని, దళిత వాడల్లో పెరగాలని ఎవరు కోరుకుంటారు? అని గతంలో చంద్రబాబు అనలేదా? అని రమేష్ ప్రశ్నించారు. విశ్వబ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా.. అగ్ని కుల క్షత్రియులను తరిమికొడతా అని చంద్రబాబు మాట్లాడలేదా? అని నిలదీశారు. ఇలాంటి మాటన్న చంద్రబాబును ఉరి తియ్యాలా? కేసు పెట్టాలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారని జోగి రమేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిసి మెలిసి కుటుంబంలా ఉన్నారని, కులాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

అయినా టీడీపీకి, చంద్రబాబుకు జ్ఞానం రాలేదు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ రిజర్వ్‌డ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లలో.. అధిక శాతం బలహీన వర్గాలకు అవకాశం కల్పించారని రమేష్ తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. తాను అంబేద్కర్ గురించి, సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడిన మాటలను వక్రీకరించారని జోగి రమేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ నాయకులు విచ్చిన్న ఆలోచనలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గాలుగా మారుస్తున్నారని, సర్కార్ సంక్షేమ పథకాలను టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని జోగి రమేష్ దుయ్యబట్టారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా.. టీడీపీ నేతలు కోర్టులకు వెళుతున్నారని జోగి రమేష్ విమర్శిచారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చేస్తున్న లబ్ధి చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా.. టీడీపీ నేతలకు జ్ఞానం రాలేదని జోగి రమేష్ విమర్శించారు. బలహీన వర్గాలు అంబేద్కర్‌ను దేవుడిలా పూజిస్తాయని, జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతాయని జోగి రమేష్ వ్యాఖ్యానించారు.
Recommended Video

గంటల్లోనే ప్రతాపం.. కోడాలి నానిపై యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు
ఇది ఇలావుండగా, మరోవైపు టీడీపీ నేతలు కూడా వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తరచూ చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత నారా లోకేష్‌లను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే మంత్రి కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గంటల్లోనే ప్రతాపం చూపిస్తామని, మంత్రి కొడాలి నానిని అంకుశం సినిమాలో రామిరెడ్డిని కొట్టినట్లు కొట్టిస్తానంటూ యరపతినేని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని యరపతినేని శ్రీనివాసరావు హితవు పలికారు. గత కొంత కాలంగా కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు యరపతినేని. ఇటీవల కూడా కొడాలిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను పది రోజులు జైలులో ఉంచితే.. వైసీపీ నేతలను వంద రోజులు జైల్లో ఉంచతానంటూ హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. తనపై అక్రమ కేసులు పెడుతోందని, తాను కేసులకు భయపడబోనని యరపతినేని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications