పవన్ ఆగ్రహం: రెచ్చగొట్టడమంటూ సర్దిచెప్తున్న టీడీపీ
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. పవన్ రాజకీయాలకు కొత్త అని, అందుకే అలా మాట్లాడారని వారు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమకు మద్దతిచ్చిన పవన్ కళ్యాణే రంగంలోకి దిగి ప్రశ్నించడంతో టీడీపీ ఇరుకున పడిపోయింది. దీంతో ఏం చేయాలో పాలుపోవడం లేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ వ్యాఖ్యల పైన కొందరు ఘాటుగా, మరికొందరు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు పవన్ కళ్యాణ్ కొత్త అని, అందుకే అలా మాట్లాడారంటూ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పవన్‌కు రాజకీయ అనుభవం లేదని, ఈ మాటల వెనుక ఇతరుల ప్రమేయం ఉండొచ్చని వ్యాఖ్యానించారు.
ప్రజలకు మంచి రాజధాని నిర్మించి, కానుకగా ఇవ్వాలనే తపనతోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిని సమీకరించారే తప్ప, అందులో ఎలాంటి దురుద్దేశం లేదని టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ దురుద్దేశంతో మాట్లాడారని తాము అనుకోబోమన్నారు. ఆయనకు భూ సమీకరణపై ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేస్తామన్నారు.

అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని ఐటీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి అన్నారు. రాజధాని భూముల సమీకరణ విషయంలో ప్రభుత్వానికి పవన్ చేసే సూచనలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. భూములు ఇవ్వని రైతులే బలవంతంగా తమ వద్ద లాక్కున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క రైతు కళ్లలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు కోరిక అన్నారు.
నూతన రాజధాని నిర్మాణానికి ఎవరైనా అడ్డుపడి ఆపితే 24వేల మంది రైతుల బతుకులు అంధకారమవుతాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు.
నష్టపరిహారం చాలదంటూ పలువురు రైతులు కోరడంతో ఆ మేరకు సీఎం చంద్రబాబు పరిహారం మంజూరు చేయడంతోపాటు నివాస, వాణిజ్య ప్రాంతాల్లో స్థలం కేటాయించారని, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ ఇలా చేసి ఉండరన్నారు. అదే సమయంలో భూసమీకరణ పూర్తయ్యాక వస్తే లాభమేమిటని ప్రశ్నించారు. పవన్, జగన్‌లు రైతులను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications