డ్రామా: రేవంత్ సహా టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్, ట్రాఫిక్‌జాం
హైదరాబాద్: సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారంటూ పదిమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను శాసన సభ నుండి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. సభ నుండి సస్పెండైన వీరు అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఎమ్మెల్యేలను తమ వాహనంలోకి ఎక్కించుకున్నారు. అయితే, సభ్యులు వాహనం దిగి అసెంబ్లీ ఎదుట ఉన్న రోడ్డు పైన బైఠాయించేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్ జాం అయింది. నలువైపులా వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు టీడీపీ సభ్యులను అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా, ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెట్టి నిర్వహించిన సమగ్ర సర్వేలో ఎంపీ కవిత రెండుచోట్ల ఎలా నమోదు చేయించుకున్నారన్న విషయమై శాసనసభలో ప్రశ్నిస్తే, నా కూతురు గురించి మాట్లాడుతారా? అంటూ 10 మందిని సస్పెండ్ చేశారన్నారు.
తెరాస నేతలు రెండు రోజులు సభ జరుగకుండా అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజా సమస్యలపై నిలదీస్తామని భయపడ్డ ప్రభుత్వం తమను వారం రోజులపాటు సస్పెండ్ చేసిందని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అలోచన చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications