దొంగల పార్టీ, జైలు తప్పదు: జగన్‌పై చంద్రబాబు ఫైర్
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అధినేత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, తమది పోలీసుల విభాగమని చెప్పిన చంద్రబాబు, ఆ దొంగలను పట్టుకుని జైల్లో వేసే బాధ్యతను తామే తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. సోమవారం రాత్రి కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన చంద్రబాబు, జగ్గయ్యపేట, నందిగామ పట్టణాల్లో, మైలవరం నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నంలో రోడ్‌షోలు, బహిరంగ సభలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చాలా తేడాలున్నాయని, కాంగ్రెస్ పార్టీ అవినీతి, అసమర్థ పాలను నిదర్శనమని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ1 ముద్దాయి అయిన జగన్ పులివెందుల అభ్యర్థి, ఏ4 మోపిదేవి వెంకటరమణ రేపల్లె నుంచి, ఏ5 ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నుంచి, ఏ8 అయోధ్య రామిరెడ్డి నరసరావుపేట ఎంపి స్థానం నుంచి పోటీలో ఉన్నారని అన్నారు.

420 కేసులో నిందితుడు, జగన్‌కు మేనమామ అయిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం నుంచి బరిలో ఉన్నారని తెలిపారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అయిన కెవిపి రామచంద్రరావు అరెస్ట్ చేయడానికి అమెరికా పోలీసులు ఎదురుచూస్తున్నారని అన్నారు.
ప్రజల సొమ్మును దోచుకొని ఎన్నికల బరిలో నిలిచిన జగన్‌కు, కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలని చంద్రబాబు కోరారు. నీతి వంతమైన, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులకు తాను సీట్లు ఇస్తే, తనతో పాటు అవినీతికి పాల్పడి జైలు జీవితం గడిపిన వ్యక్తులకు జగన్ సీట్లు ఇచ్చాడని బాబు ఎద్దేవా చేశారు. కేంద్రంలో ఎన్‌డీఏకు మూడు వందలకు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని, కేంద్రంలో సుస్థిర పాలన వస్తుందని చెప్పారు. మోడీ సహకారంతో స్వర్ణాం ధ్ర నిర్మాణం చేస్తానని చంద్రబాబు చెప్పారు.












Click it and Unblock the Notifications