తెరాస వైపు 10మంది ఎమ్మెల్యేలు, ఇంకా ఎవరెవరో...?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని దాదాపు పదిమంది శాసన సభ్యులు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారట. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తెరాసకు గట్టి పోటీనిచ్చింది. టిడిపి కూడా మంచి ఫలితాలు సాధించింది.
అయితే, ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో తమ తమ ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పలువురు ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటున్నారు. బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) నుండి ఇద్దరు, కాంగ్రెసు నుండి ఒక్కరు, స్వతంత్ర సభ్యులు మరొకరు ముఖ్యంగా తెరాసలో చేరేందుకు సిద్ధమయ్యారని సమాచారం. వారి బాటలోనే ఇంకొందరు ఉన్నారట.

బిఎస్పీ తరఫున గెలిచిన నిర్మల్ శాసన సభ్యుడు ఇంద్రకరణ్ రెడ్డి, సిర్పూర్ నుండి గెలిచిన కోనేరు కోనప్ప, నర్సంపేట నుండి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి దొంతి మాధవ రెడ్డి తెరాసలో చేరేందుకు తమ ఆసక్తిని కనబర్చారట. అయితే తెరాస మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటున్నారు.
కాగా, ఖమ్మం జిల్లా నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి గెలుపొందిన ముగ్గురు శాసన సభ్యులు తెరాస వైపు చూస్తున్నారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే వారు దానిని ఖండించారు. తాము ఏ పార్టీలో చేరడం లేదన్, జగన్ వెంటే ఉంటామని చెప్పారు. దీంతో ఆ మరికొందరు ఎవరనే ఆసక్తి చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications