నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చకు సిద్ధం: జేపీ నడ్డా
నీట్ ప్రశ్నాపత్రం అంశంపై రోజురోజుకూ వివాదం ముదురుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో దేశ రాజధాని దిల్లీలో ఇటీవల నిర్వహించిన ఛలో సంసద్ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ముట్టడికి దూసుకొచ్చిన విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జ్, బాష్ప వాయువును ప్రయోగించారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అటు దేశంలోని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. విద్యార్థులపై లాఠీ ఛార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు.
నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలోని విద్యార్థుల భవిష్యత్తుపై తమకు పూర్తి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారాన్ని ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
" రాహుల్ గాంధీకి విద్యార్థుల సంక్షేమంపై ఆసక్తి లేదు. ఆయన కేవలం నీట్ అంశంతో విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అయ్యాయి. నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చకు సిద్ధంగా ఉన్నాం. హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్ పేపర్, కేరళ, తమిళనాడు, బెంగాల్, కర్ణాటక పేపర్లు లీక్ జాబితా చాలానే ఉంది" అని కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతోనే పాఠశాల విద్యా వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. దిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల కాన్ క్లేవ్ లో ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమగ్ర శిక్ష, పీఎం శ్రీ, నిపుణ్ భారత్, పీఎం పోషణ్, ఉల్లాస్ కార్యక్రమాల ద్వారా దేశంలో విద్యా వ్యవస్థ బలోపేతం అయిందని తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. అయితే ప్రస్తుతం నీట్ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న తరుణంలో ఆయన ఈ అంశంపై మాట్లాడకపోవడం గమనార్హం.

మరోవైపు నిరాహార దీక్ష విరమణపై పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ కీలక ప్రకటన చేశారు. సీజేపీ ఆందోళనకారులు, యువతపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇస్తేనే తాను దీక్ష విరమించేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన అక్కడే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications