వైసీపీ వర్సస్ టీడీపీ - అమరావతిలో ఉద్రిక్తత,లాఠీఛార్జ్..!!
అమరావతి లో ఉద్రిక్తత కొనసాగుతోంది. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వర్సస్ ప్రస్తుత ఎమ్మెల్యే నంబూరి శంకర రావు మధ్య సవాళ్లతో టెన్షన్ మొదలైంది. పెదకూరపాడు నియోజకవర్గంలో అక్రమాలు..అభివృద్ధి పై ఇద్దరు నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. ఇరువురి ఛాలెంజ్ లో ఉద్రిక్తత ఏర్పడింది.
ఇద్దరు నేతలు తాము చేసిన ఆరోపణల పైన ఈ రోజు ఉదయం అమరావతిలోని ఆమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దమయ్యారు. దీని పైన రెండు పార్టీలకు చెందిన నేతలు సోషల్ మీడియా వేదికగా ఛాలెంజ్ లు చేసుకున్నారు. పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.

రోడ్డపైకి కార్యకర్తలు: కానీ, కొద్ది సేపటి క్రితం ఒక్క సారిగా టీడీపీ - వైసీపీ కార్యకర్తలు అమరావతి రోడ్ల పైకి దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకొనే ప్రయత్నం చేసినా వారు వెనక్కు తగ్గక పోవటంతో స్వల్ప లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. ఒక బస్సు పైన టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేసారు. అమరావతి అమరలింగేశ్వర ఆలయానికి వెళ్లేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించాయి.
వారికి పోటీగా వైసీపీ శ్రేణులు బయటకు వచ్చాయి. తాను నాలుగేళ్ల కాలంలో ఎలువంటి అవినీతికి పాల్పడలేదని.. ప్రమాణానికి సిద్దమని ఎమ్మెల్యే శంకర రావు చెబుతున్నారు. అదే సమయంలో ఇసుక మాఫియా భారీగా దోచుకున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే పైన టీడీపీ నేత కొమ్మాలపాటి ఆరోపణలు చేస్తున్నారు. వీటిని నిరూపించేందుకు సిద్దమని చెబుతున్నారు.
పరస్పర సవాళ్లు: దీంతో అమరావతిలో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. ఆలయం వైపు దూసకొస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వ్యాన్ అద్దాలను కార్యకర్తలు ధ్వంసం చేసారు. ఆదివారం రాత్రి వరకు పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలకు 149 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశారు. అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు.
5 మండలాల్లో 200 మంది నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. నంబూరి శంకరరావు తాను ఆధారాలతో వచ్చానని..తన మీద ఎటువంటి ఆరోపణల పైనా చర్చకు సిద్దమని చెబుతున్నారు. కొమ్మాల పాటికి వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నారు. ఇసుక దొంగ ఎమ్మెల్యే శంకర రావు అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
పోలీసుల లాఠీఛార్జ్: రెండు పార్టీల కార్యకర్తల నినాదాలతో అమరావతిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అటు కొమ్మాలపాటితో పాటుగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. తాను అవినీతి చేసినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని కొమ్మాలపాటి సవాల్ చేసారు.
దమ్ముంటే కొమ్మాలపాటి చర్చకు రావాలని నంబూరి శంకరరావు ఛాలెంజ్ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అమరావతి చేరుకుంటున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా రోడ్ల పైకి రావటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications