గజ్వెల్లో టెన్షన్: బాబుపైకి చెప్పు, కెసిఆర్ డౌన్ అంటూ..
హైదరాబాద్/మెదక్: మెదక్ జిల్లా గజ్వెల్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సభలో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. గజ్వెల్ నియోజకవర్గంలో తెరాస తరఫున కెసిఆర్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బాబు సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వచ్చారు.
ఈ సమయంలో సభలోకి చొచ్చుకు వచ్చిన ఓ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త సభా వేదిక పైకి చెప్పును విసిరాడు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కెసిఆర్ డౌన్ డౌన్, దళిత ద్రోహి కెసిఆర్, కెసిఆర్ ఖబడ్దార్ అంటూ నినాదాలు చేశారు. తెరాస గూండాలు తమ సభలోకి వచ్చి గొడవ చేయడమేమిటని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చెప్పు విసిరిన వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు కల్పించుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... ఇంతమంది ఉన్న టిడిపి సభలోకి ఓ తెరాస వ్యక్తి ఎలా వస్తాడని ప్రశ్నించారు. ఒక వ్యక్తి వచ్చి గొడవ చేస్తే ఏమవుతుందన్నారు. పోలీసులు పక్షపాతం చూపించవద్దన్నారు. గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున ప్రతాప్ రెడ్డి, తెరాస తరఫున కెసిఆర్, కాంగ్రెసు నుండి నర్సారెడ్డి పోటీ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications