పదో తరగతి బాలికపై తోటి విద్యార్థి, మిత్రులు గ్యాంగ్ రేప్
కడప: కడప జిల్లాలోని ఓ పాఠశాలలో జరిగిన కీచక పర్వం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిపై సహచర విద్యార్థితో పాటు అతని నలుగురు మిత్రులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఐదు రోజుల క్రితం జరిగింది.
కడపజిల్లా సిద్దవటం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. ఆ బాలికను తల్లిదండ్రులు కడపకు తరలించి రహస్యంగా చికిత్స చేయిస్తున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. గత సోమవారం జూలై 11వ తేదీన బాలికను తోటి విద్యార్థి, అతడి స్నేహితులు పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్డిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.
దీన్ని గమనించిన ఉపాధ్యాయులు బాలికను, ఆ విద్యార్థిని మందలించి పాఠశాలకు రావద్దని పంపివేశారు. పాఠశాలతో సంబంధం లేని ఆ విద్యార్థి మిత్రులు పారిపోయారు. ఇంటికెళ్లిన బాలికకు ఆరోగ్యం క్షీణించడంతో ఆమె తల్లితండ్రులు కడపకు తరలించి చికిత్స చేయిస్తున్నట్లు చెబుతున్నారు ఈ విషయం బయటకు పొక్కితే తమ ఉద్యోగాలకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందోనన్న భయంతో ఉపాధ్యాయులు నోరుమెదపడం లేదని సమాచారం.

పాఠశాల ఆవరణలో జరిగిన ఈ దారుణం గురించి వారు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచి ఉంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.. ఈ విషయమై పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు లిల్లీని వివరణ కోరగా పాఠశాలలో అలాంటిదేమీ జరగలేదని మొదట అన్నట్లు మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి.
విషయం తెలిసిన వెంటనే బాలికను, విద్యార్థిని ఇంటికి పంపించేసినట్టు ఆ తర్వాత ఆమె చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రధానోపాధ్యాయుడు వచ్చాక టీసీ ఇచ్చి పంపుతామని ఆమె తెలిపారు.