తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్: శ్రీవారి సేవలు రద్దు
Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం నాడు 65,131 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,998 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.66 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. కంపార్లమెంట్లల్లో ఉన్న భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారం, మంచినీళ్లు, పాలు పంపిణీ చేశారు. శ్రావణ మాసంలో విశేష పూజలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 14వ తేదీన సాయంత్రం అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి.
వాటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. 1962న దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది.
ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. 15వ తేదీన పవిత్రాల ప్రతిష్ట, 16న పవిత్ర సమర్పణ, 17న పూర్ణాహుతితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు. అంకురార్పణ కారణంగా 14వ తేదీన సహస్రదీపాలంకార సేవ రద్దయింది. అలాగే- 15న తిరుప్పావడతో పాటు 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications