TTD: శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా - అరుదైన ఘట్టం..!!
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ముందు గా ఉదయం 7 నుండి 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపం లో సర్వభూపాల వాహనంలో ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామి వారు గరుత్మంతు నికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు.
ఆనంద నిలయంలోని మూల విరాట్టుకు, బంగారు వాకిలి వద్ద ఆస్థానంలో వేంచేపు చేసిన ఉత్సవ మూర్తులకు ప్రత్యేకపూజలు, ప్రసాదాలు నివేదించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి పెద్ద వెండితట్టలో ఆరు పెద్ద పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు గా విచ్చేశారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, టిటిడి ఈవో, ఇతర ఉన్నతాధికారులు వెంట వచ్చారు. నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామి వారికి, మరొకటి విష్వక్సేనులవారికి అలంకరించారు. తదనంతరం శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తమ తలకు శ్రీవారి పాద వస్త్రంతో "పరివట్టం"(చిన్న పట్టుగుడ్డ) కట్టుకొని స్వామివారి ద్వారా బియ్యపు దక్షిణ స్వీకరించి 'నిత్యైశ్వర్యోభవ' అని స్వామివారిని ఆశీర్వదించారు.

ఆ తరువాత అర్చకులు శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ గారికి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ గారికి, టీటీడీ తరఫున ఈవోకి 'లచ్చన' అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. "రూపాయి" హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాల చెంత ఉంచడంతో ఆణివార ఆస్థానం ముగిసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌర మానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతినాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తా రు. అయితే సౌరమానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చింది.
పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వదినంనాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్‌ను మార్చి - ఏప్రిల్ నెలలకు మార్చారు. సాయంత్రం పుష్పపల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు.












Click it and Unblock the Notifications