ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్ - రూ. 50 వేల కోట్ల భారీ ప్రాజెక్ట్..!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రులకు శాఖలు కేటాయించారు. నూతన ప్రభుత్వ పాలన ప్రారంభమైంది. ఇదే సమయంలో భారీ పెట్టబడి ఏపీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రానికి బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్ట్ కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. రూ. 50 వేల కోట్ల భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. పరిశ్రమ ఏర్పాటుతో వేల మందికి స్థానికంగా ఉపాధి లభించే అవకాశం ఉండటంతో రాష్ట్రప్రభుత్వం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.
భారీ రిఫైనరీ ఏర్పాటు దిశగా
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోతున్న రిఫైనరీ ప్రాజెక్టును సాధించేందుకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా బీపీసీఎల్ దాదాపు రూ.50వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. బీపీసీఎల్ రిఫైనరీని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కోరుతున్నాయని తెలుస్తోంది. రూ. 500 కోట్ల రుణం, 15 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు ఇవ్వడానికి మధ్యప్రదేశ్ సంసిద్ధత వ్యక్తం చేసింది. అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహకాలను ఆశిస్తోంది బీపీసీఎల్. దీంతో బీపీసీఎల్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఏపీ అధికారులు నిర్ణయించారు.

కొనసాగుతున్న ప్రయత్నాలు
కేంద్ర ప్రభుత్వం అధికారులు సైతం.. త్వరలో ఏపీకి శుభవార్త అందుతుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు గనుక ఏపీకి వస్తే.. స్థానికంగా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రిఫైనరీ ద్వారా భారీ పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై సంస్థ యాజమాన్యం ఆరా తీసినట్లు తెలిసింది. మధ్యప్రదేశ్‌లో రిఫైనరీ ఏర్పాటు చేసినందుకు అక్కడి ప్రభుత్వం రూ.500 కోట్ల రుణంతో పాటు.. 15 ఏళ్ల పాటు జీఎస్టీ మినహాయింపు ఇచ్చిందని సంస్థ యాజమాన్యం ప్రస్థావించినట్లు సమాచారం. ఇదే తరహాలో ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే పెట్టుబడులు పెట్టడానికి బీపీసీఎల్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం.
రూ 50 వేల కోట్ల పెట్టుబడి
ఇదే ప్రాజెక్టును దక్కించుకోవడానికి ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ కూడా పోటీ పడుతుండగా ఇప్పటికే ముంబై, కొచ్చి, మధ్యప్రదేశ్‌లో బీపీసీఎల్ రిఫైనరీలు కొనసాగుతున్నాయి. కొత్తగా మరో రిఫైనరీ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని బీపీసీఎల్ పరిశీలిస్తున్న తరుణంలో తీరప్రాంతం అనువైనదని ఉన్నతాధికారులు సంస్థ సీఈఓకు వివరించారు. రాష్ట్రానికి పెట్రోకెమికల్ కాంప్లెక్స్, రిఫైనరీ ప్రాజెక్టును కేటాయిస్తామని రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి కేంద్రప్రభుత్వం హామీ ఇచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications