కడప వైసీపీ లీడర్ కేసులో ట్విస్ట్, సీఐడీని రంగంలోకి దింపిన చంద్రబాబు, పిన్ టూ పిన్
గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పూర్తి సమాచారం బయటకు లాగుతోంది. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప నగరంలో పట్టపగలు జరిగిన వైసీపీ నాయకుడి దారుణ హత్య కేసు పూర్తి సమాచారాన్ని సీఐడీ అధికారులు బయటకు లాగడంతో ఇప్పుడు కొందరు వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదని తెలిసింది.
వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి హత్య కేసు ఇప్పుడు కడప పోలీసుల నుంచి సీఐడీ చేతికి వెళ్లిపోయింది. వైసీపీ లీడర్ శ్రీనివాసరెడ్డి మత్య కేసులో కొందరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్న పోలీసులకు, ఆ కేసు నుంచి తప్పించుకున్న ప్రధాన నిందితులకు ఇప్పుడు భయం పట్టుకుందని సమాచారం. వైసీపీ ప్రభుత్వం పడిపోయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో హత్యకు గురైన వైసీపీ లీడర్ శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక తనకు న్యాయం చెయ్యాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ డీజీపీని కలిసి మనవి చేశారు.

గత ఏడాది జూన్ 23వ తేదీన ఉదయం జిమ్ చేసి తరువాత జిమ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిన వైసీపీ లీడర్ శ్రీనివాసరెడ్డిని నడిరోడ్డు మీద వెంటాడి వెంటాడి వేటకొడవళ్లతో నరికేసి దారుణంగా హత్య చేశారు. కడప నగరంలోని సంధ్యా సర్కిల్ లో పట్టపగలు శ్రీనివాసరెడ్డి హత్య జరగడం అప్పట్లో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అదే పార్టీకి చెందిన నాయకుడు శ్రీనివాసరెడ్డి హత్యకు గురి కావడంతో కడప నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కడప, కమలాపురం నియోజక వర్గాల్లో నలుగురు వైసీపీ నాయకు భూ దందాలు, సెటిల్ మెంట్లు, ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోవడం, భూ కబ్జాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నలుగురు నాయకులు అండదండలతో, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కడప, కమలాపురం నియోజక వర్గాల్లో శ్రీనివాసరెడ్డి సెటిల్ మెంట్లు చేసి కోట్లాది రూపాయల ఆస్తులు సంపాధించాడు. అనతికాలంలోనే శ్రీనివాసరెడ్డి కోటీశ్వరుడు అయిపోయాడు.
అయితే వాటాలు పంచుకునే విషయంలో శ్రీనివాసరెడ్డికి, సొంత పార్టీ అయిన వైసీపీ నాయకుల మధ్య తేడాలు వచ్చాయి. ఇదే సమయంలో శ్రీనివాసరెడ్డి దగ్గర పని చేస్తున్న ప్రతాప్ రెడ్డితో ఆయనకు గొడవలు మొదలైనాయి. ఇదే విషయంలో శ్రీనివాసరెడ్డిని అతని కిందపని చేసే ప్రతాప్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసరెడ్డి హత్య కేసులో ప్రతాప్ రెడ్డితో పాటు సుబ్బారెడ్డి, శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, రాణి, హరిబాబు, సురేశ్ కుమార్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి హత్యకు ఓ పెట్రలో బంకులో ప్లాన్ చేసి హంతకులకు ఆర్థిక సహాయం చేసిన వైసీపీకి చెందిన కీలక నాయకులను వదిలేశారని హత్యకు గురైన శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక ఆరోపణలు చేస్తూ కడప పోలీసులకు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక ఆరోపణలు చేసిన వారి మీద అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. అప్పటి ఓ వైసీపీ ఎంపీ, వైసీపీకి చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఒత్తిడితో పోలీసులు ఆ వైసీపీ నాయులను వదిలేశారని మౌనిక ఆరోపిస్తున్నది.

వైసీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదని శ్రీనివాసరెడ్డి భార్య మౌనిక సైలెంట్ అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధైర్యం చేసిన మౌనిక కడప, కమలాపురంకు చెందిన టీడీపీ నాయకుల సహాయంతో విజయవాడ వెళ్లి డీజీపీని కలిసి తన భర్త శ్రీనివాసరెడ్డి హత్య కేసులో నిందితులను అరెస్టు చెయ్యాలని మనవి చేశారు. మౌనిక ఫిర్యాదు మేరకు డీజీపీ శ్రీనివాస రెడ్డి హత్య కేసును సీఐడీకి అప్పగించారు.
కడపలో సైలెంట్ గా దిగిన సీఐడీ పోలీసులు శ్రీనివాసరెడ్డి హత్య కేసుకు సంబంధించి పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారని తెలిసింది. హత్యకు గురైన శ్రీనివాసరెడ్డితో పాటు వ్యాపారం, భూదందాలు, సెటిల్ మెంట్లు చేసిన వైసీపీ నాయకులు ఎవరు ? అని పూర్తి సమాచారం బయటకు లాగుతున్నారని తెలిసింది. కడప వైసీపీ నాయకుడు శ్రీనివాసరెడ్డి హత్య కేసు సీఐడీకి అప్పగించడంతో ఈ కేసుతో సంబంధం ఉన్న నాయకులకు దడ మొదలైయ్యిందని తెలిసింది. పూర్తి సమాచారం, ఆధారాలు సేకరించిన తరువాత శ్రీనివాసరెడ్డి హత్య కేసులో తప్పించుకున్న నిందితులను అరెస్టు చెయ్యాలని సీఐడీ అధికారులు నిర్ణయించారని సమాచారం.












Click it and Unblock the Notifications