బీజేపీకి దూరం జరుగుతున్న జనసేన? పవన్‌కల్యాణ్ సంకేతాలు!!
ఆంధ్రప్రదేశ్‌లో భారతీయ జనతాపార్టీకి దూరం జరుగుతూనే కేంద్రంతో మాత్రం సన్నిహితంగా ఉండాలనే నిర్ణయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎవరైనా అభ్యర్థి మరణిస్తే వారి కుటుంబంలోని వ్యక్తిని ఎన్నికల్లో నిలబెడితే జనసేన పోటీచేయడంలేదు. ఆత్మకూరులోను ఇదే విధానాన్ని పాటిస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. దీన్నిబట్టి ఆత్మకూరులో పోటీచేస్తున్న బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చే ప్రసక్తే ఉండదని తేల్చి చెప్పినట్లైందనేది రాజకీయ విశ్లేషకుల భావన.

జేపీ నడ్డాను కలిసే ప్రసక్తే లేదు
రాజమండ్రిలో బీజేపీ నిర్వహిస్తోన్న గోదావరి గర్జన కార్యక్రమానికి హాజరవుతున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాను కలిసే ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేశారు. ఈ పరిణామాలను విశ్లేషించిన సీనియర్ రాజకీయవేత్తలు పవన్ కల్యాణ్ క్రమక్రమంగా రాష్ట్ర బీజేపీతో దూరం జరుగుతున్నట్లు అర్థమవుతోందంటున్నారు. ఏపీలో బీజేపీ నేతలు కూడా పవన్‌ను దూరం పెడుతున్నారు. అన్ని కార్యక్రమాలు సంయుక్తంగా చేయాలనుకున్నప్పుడు గర్జనకు పవన్‌ను ఆహ్వానించాలి. కానీ ఆయనకు సమాచారం కూడా ఇవ్వలేదని జనసైనికులు మండిపడుతున్నారు.

మిత్రపక్షానికి ఆహ్వానం లేదు
జాతీయ అధ్యక్షుడు ఏపీకి వస్తుంటే మిత్రపక్షానికి ఆహ్వానం లేకపోవడంతో జనసేన నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. పవన్‌కల్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారంటూ కొంతమంది బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారని, జేపీ నడ్డా ఏపీకి వస్తుంటే వపన్ ను ఆహ్వానించనివారు ముఖ్యమంత్రిని ఎలా చేస్తారంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతలు కావాలనే పవన్ కల్యాణ్ ప్రాముఖ్యతను తగ్గించేందుకు ఆడుతున్న నాటకమని ఆ పార్టీ కార్యకర్తల భావనగా ఉంది.

వైసీపీ కోవర్టులుగా బీజేపీ నేతలు?
అలాగే ఏపీలోని బీజేపీ నేతలను తాను అసలు పట్టించుకోనని పవన్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలంతా రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కోవర్టులేనన్న నమ్మకంతో పవన్ ఉన్నారని, అందుకు తగ్గట్లుగా కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకొనే దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మధ్యలో జనసేనకు నష్టం
కేంద్ర ప్రభుత్వానికి అవసరాలున్నాయా? లేదంటే ఇంకే రకమైన రాజకీయమోకానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బీజేపీ నేతలు ప్రోత్సహిస్తున్నారనేది సుస్పష్టం. మధ్యలో జనసేన ఒక్కటే అమాయకంగా బలవుతోందన్న అభిప్రాయానికి పవన్ వచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడిన మాటలను బట్టి, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తుంటే దాదాపుగా ఆయన బీజేపీకి దూరమైనట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications