తరుముకొస్తున్న మరో వాయు'గండం' - ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..!!
మరో సారి భారీ వర్షాలపై వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది. మలక్కా జలసంధి, ఇండోనేసియా సమీపంలోని తీవ్ర వాయుగుండం నిన్న (బుధవారం) తుపానుగా బలపడింది. ఈరోజు (గురువారం) సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని, తర్వాత బలహీనపడుతుంద ని అంచనా. ఇది దిశ మార్చుకుని తిరిగి మలేసియా వైపు వెళ్లే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావం భారత భూ భాగం పై ఉండదని స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతం లో శ్రీలంక సమీపంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది క్రమంగా ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశము ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది.

ఇది తుపానుగా బలపడే అవకాశముందని కొన్ని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి. దీని ప్రభావంతో శనివారం నుంచి సోమవారం వరకూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తా యని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని వెల్లడించింది.
కాగా, ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, యానాంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశము ఉందని పేర్కొంది. నేడు (గురువారం) తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. శుక్ర, శని, ఆదివారాల్లో గరిష్ఠంగా 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో అత్యల్పంగా 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయింది.












Click it and Unblock the Notifications