తుఫాను తీవ్రరూపం, కుండపోత వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
ఏపీకి వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజులు పూర్తి స్థాయిలో అప్ర మత్తంగా ఉండాలని హెచ్చరించింది. మొంథా తుఫాన్ మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇవాళ సాయంత్రానికి తుపానుగా మారే అవకాశం ఉంది. కాకినాడ సమీపంలో మచిలీపట్నం-కళింగ పట్నం మధ్య తీవ్రతుపాను తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో.. ప్రభుత్వం అలర్ట్ అయింది. అధికారులను అప్రమత్తం చేసింది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. పాఠశాలలకు మూడు రోజులు సెలవులు ప్రకటించారు.
మొంథా తుపాను భయపెడుతోంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో అటు మచిలీపట్నంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. కాగా, తుపాను తీరందాటే సమయంలో గంటకు 90-110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

సోమవారం, మంగళవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు.
కాగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రత్యేక అధికారులను జిల్లాలకు పంపిన ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. తీరప్రాంత ప్రజలను సుర క్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను ముందు గానే సిద్ధం చేయాలని సూచించారు. కాలువలు, చెరువులు, నదులను నిత్యం పర్యవేక్షించాలని
నిర్దేశించారు. విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదుకు అధికారులు ప్రత్యేక నంబర్లను ఏర్పాటు చేశారు.
ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు నంబర్ 8331018762, విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదునకు టోల్‌ఫ్రీ నంబర్ 1912, అదే విధంగా అంతరాయంపై ఫిర్యాదునకు వాట్సాప్ నంబర్ 9493916192 లను సంప్రదించవచ్చు. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని ప్రజలకు విద్యుత్‌శాఖ హెచ్చరించింది. ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాల్లో మూడు రోజులు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు. ఎమర్జెన్సీ సేవల్లోని ఉద్యోగులకు సెలవు రద్దు చేసారు. ప్రభావిత జిల్లాల ప్రజలకు ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ ల ద్వారా సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications