ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా
AP BJP candidates: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష తెలుగుదేశం.. మరోసారి కూటమి కట్టింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి జనసేన- భారతీయ జనతా పార్టీలను ఆశ్రయించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమిలోనూ చేరింది.
కూటమి మధ్య సీట్ల పంపకాల వ్యవహారం పూర్తిస్థాయిలో కొలిక్కి రావట్లేదు. అయిదు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. జనసేనలో కూడా సీట్ల కేటాయింపు దాదాపుగా ముగిసినప్పటికీ- తుది జాబితా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. బీజేపీ జాబితా ఈ సాయంత్రానికి వెలువడొచ్చు.

ఏపీలో లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీ చేయదలిచిన బీజేపీ అభ్యర్థుల జాబితాపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కసరత్తు పూర్తి చేసింది కూడా. నిజానికి శనివారం రాత్రి నాటికి ఈ జాబితా విడుదలు అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి గానీ అది వాస్తవ రూపం దాల్చలేదు.
ఏపీతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన లోక్‌సభ స్థానాలతో కూడిన జాబితాను ఒకేసారి విడుదల చేయాల్సి ఉన్నందున జాప్యం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నుంచి తుది ఆమోదం లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని సమాచారం.
కసరత్తు పూర్తి చేసిన జాబితాలో ఏపీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇందులో నరసాపురం- మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాజమండ్రి- ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి, అనకాపల్లి- రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
రాజంపేట లోక్‌సభ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- వరప్రసాద్ లేదా కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, అరకు- మాజీ ఎంపీ కొత్తపల్లి గీత పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. రత్నప్రభ గతంలో కూడా బీజేపీ తరఫున తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications