టిడిపిలో కాల్‌మనీ చిచ్చు: ఆ ఫొటోలు టిడిపి నేతల నుంచే జగన్ చేతికి?
విజయవాడ: కాల్ మనీ వ్యవహారానికి సంబంధించి నిందితులతో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగిన ఫొటోలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎలా అందాయనేది చర్చనీయాంశంగా మారింది. విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఉన్న విభేదాలే కాల్ మనీ కుంభకోణం బయటపడడానికి కారణమని భావిస్తుండగా, ఆ విభేదాలు తారా స్థాయికి చేరాయని చెప్పే ఉదంతం కూడా చోటు చేసుకుంది.
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మరో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గెస్ట్ హౌస్‌లో నిందితుడితో కూర్చున్న ఫొటో గానీ, సత్యానందంతో చంద్రబాబు దిగిన ఫొటో గానీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారానే జగన్‌కు చేరినట్లు తెలుస్తోంది. గద్దె రామ్మోహన్ ఓ టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించడానికి వెళ్లినప్పుడు ఆయనతో పాటు కాల్ మనీ నిందితుడు యలమంచిలి రాము, మరికొంత మంది అదే టేబుల్‌పై కూర్చున్నారు. అయితే, అది విందు భోజనం కాదని అంటున్నారు.

అయితే, ఆ ఫోటో జగన్ చేతికి ఎలా వచ్చిందనేది చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొంత మంది నేతలే ఆ పోటోలను జిల్లాకు చెందిన ఓ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత ద్వారా జగన్‌కు చేరవేశారని అంటున్నారు. సాక్షి దినపత్రికలో కూడా ఆయన ద్వారానే ఫొటోలు ప్రచురితమయ్యాయని అంటున్నారు.
అంతేకాకుండా కాల్ మనీ కీలక నిందితుడైన సత్యానందం చంద్రబాబుతో దిగిన ఫొటోతో పాటు మరికొన్ని ఫోటోలు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు అందజేసింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని అంటున్నారు. అయితే, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న తమ పార్టీ నాయకుడు ఎవరనే విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
విజయవాడకు చెందిన ఇద్దరు నాయకులపై అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఆ ఇరువురు నేతల విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాల్ మనీ వ్యవహారం వెలుగు చూసింది తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని చొరవ కారణంగానే అనేది దాదాపు స్పష్టమవుతున్న విషయం.












Click it and Unblock the Notifications