క్వింటా ఏకంగా 23వేలు పైనే .. ఏపీలో ఆ రైతుల పంట పండింది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిర్చి సాగు చేసిన రైతన్నలకు శుభవార్త. ప్రస్తుతం సంక్రాంతి పండుగ తర్వాత ఊహించని విధంగా మిర్చి కి ధర పెరగడంతో రైతులు సంతోషంలో ఉన్నారు. మార్కెట్లో గిరాకీ పెరగడంతో పాటు ఏపీ, తెలంగాణలో దిగుబడులు తగ్గడం, కర్ణాటకలోనూ మిర్చి దిగుబడి తగ్గడం వంటి అనేక కారణాలు ఏపీలో మిర్చికి భారీ డిమాండ్ కు కారణమయ్యాయి.
ఆ మిర్చి రకాలకు బాగా పెరిగిన ధర
గుంటూరు మిర్చి యార్డ్ లో ప్రధానంగా 341, దేవనూరు డీలక్స్ వంటి రకాలకు భారీ డిమాండ్ పలుకుతుంది. గత కొన్ని వారాలుగా కారప్పొడి తయారీకి ఉపయోగించే మిర్చి రకాలకు మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. ముఖ్యంగా దేవనూరు డీలక్స్ రకం మిర్చి క్వింటా ధర ఏకంగా నాలుగు వేల రూపాయలకు పైగా పెరిగింది.

ప్రస్తుతం క్వింటా మిర్చి 23 వేలకు పైగానే
దేవనూరు డీలక్స్ రకం మాత్రమే కాదు, 341 వ రకం మిర్చి, 334, నంబర్ 5, సూపర్ 10, 335 బ్యాడిగి, తేజ వంటి రకాలు కూడా మంచి ధరలు పలుకుతున్నాయి. జనవరి ఆరవ తేదీన క్వింటా దేవనూరు డీలక్స్ ధరలు 20,500 రూపాయలు పలకగా, ప్రస్తుతం ధర 23 వేల రూపాయలకు చేరుకుంది. ఈ ధరల పెరుగుదల రైతన్నలకు సంతోషం కలిగిస్తుంది.
రైతుల పంట పండిందిగా
ఊహించని విధంగా కారంపొడి తయారీకి ఉపయోగించే మిరపకాయల కోసం మార్కెట్లో పోటీ ఉంది. దీంతో మార్కెట్లో నెలకొన్న డిమాండ్ ను బట్టి ఈ కారప్పొడి తయారీ మిర్చికి ధరల పెరుగుదల కొనసాగుతుంది. ఇక మిర్చి ధరలు పెరుగుతున్న క్రమంలో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంట పండించిన తర్వాత మార్కెట్ కు తెస్తే ధరలు లేవని బాధపడే రైతులు ప్రస్తుతం, తమ పంట పండిందని భావిస్తున్నారు.
మిల్లులు, పచ్చళ్ళ తయారీదారుల నుండి బాగా డిమాండ్
మిరపకాయల ధరలు ఘాటెక్కటం మిర్చి రైతులకు సంతోషాన్ని కలిగిస్తుంటే, వినియోగదారులకు మాత్రమే ఇది భారంగా మారుతుంది. ఏది ఏమైనా గుంటూరు మిర్చి యార్డులో పెరుగుతున్న ధరలతో రైతులు పండుగ చేసుకుంటున్నారు.మిల్లులు, పచ్చళ్ళ తయారీదారుల నుండి బాగా డిమాండ్ ఉండటంతో మిరపకాయల ధర పెరిగింది.












Click it and Unblock the Notifications