నామినేషన్లకు అవకాశం ఇవ్వండి -మా అభ్యర్ధులకు సెక్యూరిటీ కావాలి : ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు..!!
రాష్ట్ర ఎన్నికల సంఘం పెండింగ్ లో ఉన్న మున్సిపల్..స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయటానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక వైపు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ అధికార పార్టీ దౌర్జన్యాలకు దిగుతోందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పార్టీ తరపున నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి... పలు అంశాల పైన ఫిర్యాదు చేసారు. రాష్ట్రంలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ప్రారంభించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వైసీపీ గెలిచే పరిస్థితి లేదు
హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు.పకడ్బంధీగా ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచే పరిస్థితి ఉండదని, అందుకే ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తుందని అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా ప్రభుత్వం నియమించిందని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని అధికారులు గుర్తు పెట్టుకోవాలని చంద్రబాబు హెచ్చరించారు.

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తామంటే సహించం
ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా పనిచేస్తోందా అని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు. దీపావళి రోజున నామినేషన్లు వేయమనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇవాళ క్రిస్మస్ అయితే ఎన్నికల ప్రక్రియ కొనసాగించేవారా అని నిలదీశారు. నామినేషన్లు వేయొద్దని స్వయంగా పోలీసులు హెచ్చరించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఒకప్పుడు నామినేషన్లలో తప్పొప్పులు ఉంటే సరిచేసే వారని.. ఇప్పుడు నామినేషన్లు ఏకంగా డిస్‌క్వాలిఫై చేస్తున్నారని విమర్శించారు.

చర్యలు తీసుకోకుంటే న్యాయస్థానానికి వెళ్తాం
ఆర్వోలు డ్రామాలు ఆడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇక, ఇవే అంశాల పైన టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను టీడీపీ నేతలు కలిశారు. గురజాల, జంగమేశ్వరపురంలో ఎన్నికల్లో భయోత్పాతం సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత జీవీ ఆంజనేయులు చెప్పుకొచ్చారు. మెయిన్ సెంటర్‌లో నామినేషన్ వేయడానికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైకోర్టు చెప్పినా టీడీపీ అభ్యర్థులకు సెక్యూరిటీ ఇవ్వడంలేదని, అవసరమైతే ప్రభుత్వం దౌర్జన్యాలపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు.












Click it and Unblock the Notifications