శ్రీవారికి భక్తుల కోసం తిరుమలలో..
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 62,323 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 20,460 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.92 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఏడు కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- వేసవి సెలవుల్లో శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి తిరుమలకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్త తీసుకుంటోన్నారు టీటీడీ అధికారులు. కాళ్లకు వేడి తగలకుండా పెయింట్ వేయడం మొదలుకుని ఓఆర్ఎస్ పాకెట్లను నిల్వ ఉంచడం వరకూ అన్ని రకాల చర్యలను చేపట్టనున్నారు.
దీనిపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో ఈ సమావేశం ఏర్పాటైంది. టీటీడీలోని వివిధ విభాగాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. వేసవి సెలవుల్లో భక్తుల రద్దీ, వారికి కల్పించాల్సిన ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులకు వెంకయ్య చౌదరి పలు ఆదేశాలను జారీ చేశారు.
మొదటి ఘాట్ రోడ్డులోని అక్కగార్ల గుడి, శ్రీవారి సేవా సదన్, తిరుమలలో భక్తుల రద్ధీ అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పెయింట్ వేయాలని అన్నారు. వేసవిలో విద్యుత్ కోతలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సెలవుల వల్ల వేసవిలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, దానికి అనుగుణంగా తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని ఆలయ పోటు అధికారులకు సూచించారు అదనపు ఈఓ. భక్తుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను నిల్వ ఉంచుకోవాలని మెడికల్ విభాగం అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరా సజావుగా ఉండటానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications