నటుడు, ఎంపి మురళీమోహన్ పుత్రుడి ఇంట్లో చోరీ
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ కుమారుడు రామ్మోహన్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీలో రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంక దేశానికి చెందిన యువతి నాచియాకు చెందిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. మొత్తం ఆరు లక్షల విలువ చేసే సొత్తు చోరీకి గురైనట్లు ఆదివారం రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం - రామ్మోహన్ స్నేహితురాలు శ్రీలంకకు చెందిన నాచియా అనే యువతి ఓ వివాహానికి హాజరయ్యేందుకు జనవరి 28న హైదరాబాద్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె ఫిలింనగర్‌లోని స్నేహితుడైన రామ్మోహన్ ఇంట్లో ఉంటున్నారు. వివాహ వేడుకలు ముగియడంతో ఆమె ఆదివారం శ్రీలంకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో తన వస్తువులు సర్దుతుండగా బంగారు ఆభరణాలు కనిపించలేదు.

ఇంట్లో ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇంటి పని మనుషులపై అనుమానంతో వారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
చోరీకి గురైన నాచయా ర్యూబీ నెక్లెస్, బంగారు ఉంగరం, ఆమె కూతురు నెక్లెస్ రూ. 10 వేల విలువ ఉంటుందని అంచనా. రామ్మోహన్ ఇంట్లోని పని మనుషుల్లో ఎవరైనా చోరీకి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు పని మనుషులను ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications