పోలీసాఫీసర్ ఇంట్లో చోరీ: తమిళ దొంగల పట్టివేత
హైదరాబాద్: దైవదర్శనానికి తిరుపతికి వెళ్లిన హైదరాబాద్ పోలీసు అధికారి ఇంట్లో దొంగలు పడ్డారు. బీరువా పగులకొట్టి ఒక కేజీ బంగారం, ఏడు కేజీల వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. హైదరాబాదులోని సైదాబాద్ పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
సైదాబాద్ డివిజన్ లోకాయుక్త కాలనీలో నివసించే వైవిఎస్ భాస్కరశర్మ లక్డీకపూల్‌లోని ఇంటిలిజెన్స్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటర్ అధికారిగా పనిచేస్తున్నారు. గత సోమవారం ఆయన ఇంటికి తాళంవేసి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లారు.
గురువారం ఉదయం ఇంటికి చేరుకున్న వారికి ఇంటి తాళం పగులగొట్టి, ఇంటిలోని బీరువా తెరవబడి, అందులోని కేజీ బంగారం, 7కేజీల వెండి సామగ్రి కొంత నగదు దొంగతనం జరిగిందని ఆయన సైదాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. మలక్‌పేట ఎసిపి సుధాకర్ క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌తో పరిశీలించారు. సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తమిళనాడు దొంగల పట్టివేత
తమిళనాడు రాష్ట్రం శంకరపురం గ్యాంగ్‌కు చెందిన ఇద్దరు ముఠా సభ్యులను హైదరాబాదులోని ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2.4 లక్షలు విలువ చేసే ఎనిమిది ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పంజాగుట్ట ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసిపి వెంకటేశ్వర్లు, ఎస్సార్‌నగర్ డిఐ శంకర్ కేసు వివరాలను వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రం వెల్లూరు మండలం శంకరాపురం గ్రామంలో ఊరు మొత్తం దొంగలే అని, ఆ ఊరికి చెందిన దొంగల ముఠా సభ్యులు నెలలో ఒకసారి నగరానికి వచ్చి నగర శివార్లలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు సమీపంలో నివాసం ఏర్పర్చుకుంటారు. ముఖ్యంగా హాస్టళ్లు, అపార్ట్‌మెంట్‌లను దొంగతనానికి ఎంచుకుంటారు. గ్యాంగ్‌లోని సభ్యులు ఇద్దరిద్దరుగా విడిపోయి రాత్రి 10 గంటల సమయంలో దొంగతనానికి బయలు దేరుతారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో దొరికింది దోచుకొని వెళ్లిపోతారు.
వీరు ఎక్కడికి దొంగతనానికి వెళ్లినా మరుసటి రోజు ఉదయం 11 గంటల కల్ల వారు నివాసం ఏర్పర్చుకున్న ప్రాంతానికి తప్పకుండా రావాల్సిందే. ఒకవేళ రాకపోతే వారు పోలీసులకు చిక్కినట్టు నిర్ధారించుకొని మిగిలిన వారు అక్కడి నుంచి పారిపోతుంటారు. వీరు శంషాబాద్ మండల్ బుద్వేల్ రైల్వేస్టేషన్ సమీపంలో నివాసం ఏర్పర్చుకున్నారు.
అందులోని ఇద్దరు సభ్యులైన వెంకటస్వామి సుబ్రహ్మణ్యం, బాలాజీ మురుగన్‌లు మంగళవారం రాత్రి ఎస్సార్‌నగర్ వద్ద ఆటోలో అనుమానాస్పదంగా వెళుతుండగా అక్కడే వాహనాలు తనిఖీ చేస్తున్న డిఐ శంకర్ వారిని పట్టుకున్నారు.












Click it and Unblock the Notifications