అప్పుడు పవన్-ఇప్పుడు చంద్రబాబు ! లోకేష్ కు హతవిధీ..?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన నేతలు జనంలోకి విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ క్రమంలో అందరి కంటే ముందు పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ యువనేత నారా లోకేష్ కు ఆరంభంలో పరిస్ధితులు బాగానే ఉన్నా.. క్రమంగా ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పొత్తుకు ప్రయత్నిస్తున్న విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వరుసగా పెడుతున్న టూర్లు, ఇతర కార్యక్రమాలతో లోకేష్ పాదయాత్ర తేలిపోతోంది.
రాష్ట్రంలో వైసీపీకి ఈసారి గట్టి పోటీ ఇచ్చి గెలవాలంటే అన్ని వైపులా పోరు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరికి వారుగా విడిపోయి పాదయాత్రలు, పర్యటనలు, బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అయితే వీరు ముగ్గురు ఒకే సమయంలో ఈ కార్యక్రమాలు పెట్టుకోకపోయినా దాదాపుగా వీరిలో ఎవరో ఒక ఇద్దరు నేతలు మాత్రం ఏకకాలంలో తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో వీరిలో ఒక్కరు మాత్రమే జనంలో ఫోకస్ అయ్యే పరిస్ధితి నెలకొంటోంది.

ఆరంభంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు జనం ఫోకస్ ఆయనపైకి మళ్లింది. తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి రాయలసీమలో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ ఆరంభంలో బాగానే ఆకట్టుకున్నారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలుపెట్టారో అప్పటి నుంచి లోకేష్ కు కష్టాలు మొదలయ్యాయి. మీడియాతో పాటు జనంలోనూ లోకేష్ కంటే పవన్ ఎక్కువగా ఫోకస్ అయ్యారు. వైసీపీపై లోకేష్ ఆరోపణల కంటే పవన్ వ్యాఖ్యలకే ఎక్కువగా ఆదరణ లభించింది. దీంతో వైసీపీ కూడా అంతే దీటుగా ఎదురుదాడి చేసింది.
ఆ తర్వాత ఇప్పుడు తన తండ్రి చంద్రబాబే ఆయనకు ఇబ్బందికరంగా మారారు. చంద్రబాబు రాయలసీమ టూర్ ప్రకటించగానే అంతగా పట్టించుకోని జనం.. ఆ తర్వాత పులివెందులలో ప్రసంగంతో ఒక్కసారిగా చంద్రబాబుపైకి దృష్టి మళ్లించారు. అనంతరం పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు పెట్టిన టూర్, అనుసరించిన వ్యూహాలు అధికార వైసీపీని చికాకుపెట్టాయి. దీంతో పుంగనూరులో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో మరోసారి రాష్ట్రంలో జనం ఫోకస్ చంద్రబాబుపైకి మళ్లింది. దీని నడుమ లోకేష్ పాదయాత్ర ఎటో పోతోంది.












Click it and Unblock the Notifications