బాబు ఆపరేషన్ ఆకర్ష్: జగన్‌కు షాక్ ఇచ్చే నలుగురు ఎమ్మెల్యేలు?
హైదరాబాద్: మరో నలుగురు శాసనసభ్యులు త్వరలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే షాక్ ఇస్తారని అంటున్నారు. వారు సాధ్యమైనంత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు ఉహాగానాలు చెలరేగుతున్నాయి. సోమవారంనాడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన భేటీకి వారు గైర్హాజరయ్యారు.
కలమట వెంకటరమణ (పాతపట్నం, శ్రీకాకుళం జిల్లా), సర్వేశ్వర రావు (అరకు, విశాఖ జిల్లా), వై. సాయి ప్రసాద్ రెడ్డి (ఆదోనీ, కర్నూలు జిల్లా) వై బాలనాగిరెడ్డి (మంత్రాలయం, కర్నూలు జిల్లా) త్వరలోనే టిడిపిలోకి దూకుతున్నట్లు ప్రచారం సాగుతోంది.
తాము సోమవారంనాటి సమావేశానికి రాకపోవడానికి గల కారణమేమిటనేది కూడా వారు తెలియజేయలేదు. జగన్‌కు తాము రాకపోవడానికి గల కారణాలు తెలియజేయకపోవడంతో వారిపై ఆశలు వదులుకున్నట్లేనని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వర్గాలంటున్నాయి.

సమావేశానికి హాజరు కాని పెద్దరెడ్డి రామచంద్రా రెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావు విదేశాల్లో ఉన్నారు. తాము సమావేశానికి రాలేకపోతున్న విషయాన్ని వారు జగన్మోహన్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. మేకపాటి గౌతం రెడ్డి కూడా సమావేశానికి రాలేదు. ఈ ముగ్గురు శాసనసభ్యులపై జగన్ సందేహం వ్యక్తం చేయడం లేదు.
తాజా పరిణామాల నేపథ్యంలో శాసనసభ్యుల పట్ల జగన్ వ్యవహార శైలి కూడా మారిందని అంటున్నారు. శాసనసభ్యులతో ఆయన ముఖాముఖి మాట్లాడారు. పార్టీ వేదిక మీద అందరి ముందు శాసనసభ్యులపై సందేహాలు వ్యక్తం చేయడం కన్నా రహస్యంగా విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని భావించి ఆయన అలా చేసినట్లు చెబుతున్నారు.
బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతన్న పోరాటాన్ని నీరు గార్చడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం, విశాఖ జిల్లాల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులపై గురి పెట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications