విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరూ ఇద్దరే: ఎదురుపడితే ఒకలా... పరోక్షంలో మరోలా, మంత్రులై ఉండీ...

ఆ ఇద్దరూ ఎదురుపడితే ఆప్యాయంగా పలుకరించుకుంటారు. చూసే వారికి ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా కనిపిస్తారు. కానీ పక్కకి రాగానే ఒకరికొకరు బద్ధ శత్రువులైపోతారు. వారే అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆ ఇద్దరూ ఎదురుపడితే ఆప్యాయంగా పలుకరించుకుంటారు. చూసే వారికి ఇద్దరూ ప్రాణ స్నేహితుల్లా కనిపిస్తారు. కానీ పక్కకి రాగానే ఒకరికొకరు బద్ధ శత్రువులైపోతారు. వారే అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.

వీరిద్దరు నిజంగానే ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. ఇప్పుడు మాత్రం బద్ధ శత్రువులు. పైగా వీళ్లిప్పుడు విశాఖపట్నం జిల్లాకు మంత్రులు. ఇద్దరూ బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పటికీ వీరి చేష్టలు మాత్రం బాధ్యతా రాహిత్యంగా కనిపిస్తున్నాయి.

మిత్రపక్షంలో ఉండి కూడా...

మిత్రపక్షంలో ఉండి కూడా...

విశాఖలో వేల కోట్ల రూపాయల భూ కుంభకోణంపై మీడియాలో నిరంతరం వస్తున్న వార్తా కథనాలతో విశాఖ పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. ప్రభుత్వం ప్రతిష్ట మంట కలిసింది. పార్టీ పరువు కూడా బజారున పడింది. దీనికితోడు జిల్లా మంత్రులు ఇద్దరూ రోడ్డెక్కారు. ఒకరిని మరొకరు వేలెత్తి చూపుకొంటున్నారు. మిత్రపక్షంలో ఉన్న బిజెపి శాసనసభాపక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజు కూడా కుంభకోణంలో అనేక కోణాలను వెలుగులోకి తెచ్చి.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచారు.

బయటపడ్డ విభేదాలు...

బయటపడ్డ విభేదాలు...

విశాఖ జిల్లాలో బయటపడిన భూ కుంభకోణం వీరి మధ్య అంతర్లీనంగా ఉన్న శత్రుత్వాన్ని మరోసారి బయటపెట్టింది. విశాఖ ప్రజలు అమాయకులని ముఖ్యమంత్రి చెపుతుంటే, పాపం జనం కూడా నిజమేనేమో అనుకుంటున్నారు. కానీ ఈ ఇద్దరు మంత్రుల వైఖరితో విశాఖ అమాయక ప్రజలు కూడా విసుగుచెందారంటే అతిశయోక్తి కాదు. రూ.20 వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణం విశాఖలో జరిగినట్లు సాక్షాత్తూ జిల్లా కలెక్టరే చెప్పారు. ఇదే సమయంలో బాధ్యత గల మంత్రులు జోక్యం చేసుకుని దీని గురించి ఏమాత్రం ఆరా తీయలేదు సరికదా.. మంత్రి అయ్యన్న పాత్రుడు కుంభకోణంలోని కొన్ని వాస్తవాలను మీడియా ముందుకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ కుంభకోణాల ధారావాహిక కొనసాగుతునే ఉంది.

సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?

సీఎం దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?

విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణం గురించి అయ్యన్న నేరుగా సిఎం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లలేకపోయారు? ఆయనకు సీఎం చంద్రబాబునాయుడి అపాయింట్‌మెంట్ దొరకకపోతే, విధిలేని పరిస్థితుల్లో మీడియా ముందు చెప్పారనుకోవచ్చు. కానీ నిత్యం చంద్రబాబును కలిసే అయ్యన్న.. విశాఖలో జరుగుతున్న దారుణాలను ఆయనకు వివరించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?

మంత్రి ఇలాకాలోనే అధికం...

మంత్రి ఇలాకాలోనే అధికం...

విశాఖలో భూ కుంభకోణం రోజుకో మలుపు తిరుగుతున్నా మంత్రి గంటా శ్రీనివాసరావు మాత్రం పెదవి విప్పలేదు. ఈ కుంభకోణంగా సాక్షాత్తూ మంత్రి బంధువుల హస్తం ఉందని పత్రికలు ఘోషిస్తున్నా, గంటా పెద్దగా పట్టించుకోలేదు. మీడియా ఎదురుపడితే, దోషులను శిక్షిస్తామని చెప్పి తప్పించుకున్నారు. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయతమైన మంత్రి స్థానంలో ఉండీ ఇంత నిర్లిప్త వైఖరి ప్రదర్శించడం ఏమిటి? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటి వరకు జరిగిన స్కాముల్లో అధిక భాగం మంత్రి గంటా శ్రీనివాసరావు నియోజకవర్గంలోనే ఉండటం.

తప్పుదోవ పట్టించే పనులెందుకు?

తప్పుదోవ పట్టించే పనులెందుకు?

కొద్ది రోజుల కిందట మంత్రి గంటా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. కనీసం అప్పుడైనా ఈ కుంభకోణాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుని సీఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సిందనే అభిప్రయాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన కూడా నిత్యం సీఎంను కలుస్తూనే ఉంటారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన, చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉన్నపళంగా లేఖ రాయాల్సిన అగత్యం గంటాకు ఎందుకు వచ్చింది? అది కూడా తొమ్మిదో తేదీన రాసిన లేఖ 14న ఎందుకు వెలుగులోకి వచ్చింది? కేవలం మీడియాను తప్పుదోవ పట్టించేందుకే ఈ లేఖాస్త్రాన్ని ప్రయోగించారా?

సిట్‌పై నమ్మకం లేదా?

సిట్‌పై నమ్మకం లేదా?

విశాఖలో భూ కుంభకోణంపై విచారణకు ప్రభుత్వం సిట్‌(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)ను నియమించింది. దానివల్ల ఉపయోగం లేదని కాస్త లా పాయింట్‌లు తెలిసినవారందరికీ అర్థమవుతోంది. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు రాసిన లేఖలో ఈ భూ కుంభకోణంపై సిఐడి, లేదా సిబిఐతో విచారణ జరిపించాలని కోరడాన్ని చూస్తే, సిట్‌పై ఆయనకు కూడా నమ్మకం లేనట్టే అనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐడి, సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం లేదు. అటువంటప్పుడు సీఎంకు గంటా లేఖ ఎందుకు రాసినట్లు? ఎందుకు డిమాండ్ చేసినట్లు?

అప్పుడలా... ఇప్పుడేమో...

అప్పుడలా... ఇప్పుడేమో...

వుడాలో రూ.500 కోట్ల కుంభకోణం జరిగినప్పుడు గంటా శ్రీనివాసరావు చలించిపోయి, విశాఖ పరువు కాపాడే విధంగా వుడాను దారిలోకి తెస్తామని అన్నారు. మరిప్పుడు ఏకంగా రూ.20 వేల కోట్ల రూపాయల భూ కుంభకోణానికి మాఫియా తెగబడితే, మంత్రులు ఇద్దరూ అధికారులను దగ్గర కూర్చోబెట్టుకుని బాధితులకు న్యాయం జరిగేలా ఎందుకు చూడలేకపోయారు? బాధితులను గాలికొదిలేసి, తమ విభేదాలను మరోసారి తెర మీదకు తెచ్చి, కుంభకోణాన్ని మరిపింపజేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

English summary
They are ministers in the present government. People can't judge are they friends or enemies. They are Minister Ganta Srinivasa Rao and Minister Ayyannapatrudu. Minister Ayyannapatrudu allegedly reporting on Minister Ganta Srinivas Rao regarding Visakhapatnam Land Scam. Even BJP MLC Vishnukumar Raju also passed damagable comments on Minister Ganta in this regard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X