
ఐదోతరగతి విద్యార్ధిపై థర్డ్ డిగ్రీ; చితకబాదిన స్కూల్ ప్రిన్సిపాల్; నరసరావుపేటలో దారుణం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నరసరావుపేట లోని ఓ ప్రైవేటు స్కూల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్ కలిసి చితకబాదారు. విద్యార్థి ఏదో తప్పు చేశాడని విచక్షణారహితంగా ఒళ్లంతా వాతలు తేలేలా కొట్టారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

విద్యార్థిని చితకబాదిన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్
గుంటూరు జిల్లా నరసరావుపేట రెయిన్ బో స్కూల్ లో చదువుతున్న విద్యార్థి వసంతరావును పాఠశాల ప్రిన్సిపాల్, టీచర్ దారుణంగా కొట్టిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. నరసరావుపేట గ్రామీణ పోలీసుల కథనం ప్రకారం నవోదయనగర్ ప్రాంతంలోని రెయిన్ బో స్కూల్ లో ఐదోతరగతి చదువుతున్న కోగంటి వసంతరావు అనే విద్యార్థి బోర్డు పై అమ్మాయిల పేర్లు రాస్తున్నాడు అంటూ ఉపాధ్యాయుడు విద్యార్థిని తీవ్రంగా కొట్టారు.

గంటన్నర పాటు విద్యార్థిపై థర్డ్ డిగ్రీ ప్రయోగం
దాదాపు గంటన్నర పాటు విద్యార్థిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. తాను ఏ తప్పు చేయలేదని విద్యార్థి వాపోతున్న పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కమిలిపోయి, ఒళ్లంతా వాతలు తేలేలా చెయ్యని తప్పును ఒప్పుకోమని దారుణంగా కొట్టినట్టు విద్యార్థి వసంతరావు చెప్తున్నాడు. తాను బోర్డు మీద ఏ అమ్మాయిల పేర్లు రాయలేదని విద్యార్థి వసంతరావు చెబుతున్నాడు.

బోర్డుపై అభ్యంతరకర రాతలు రాస్తున్నాడని విద్యార్థిని మందలించాం అన్న స్కూల్ యాజమాన్యం
ఇదిలా ఉంటే పాఠశాల యాజమాన్యం మాత్రం గత కొద్ది రోజులుగా విద్యార్థి పాఠశాలలో బోర్డుపై అభ్యంతరకరమైన రాతలు రాస్తున్నారని, అమ్మాయిల పేర్లు రాస్తూ ఇబ్బంది పెడుతున్నాడని, ఇప్పటికి ఎన్నో సార్లు మందలించినప్పటికీ విద్యార్థి ప్రవర్తన మార్చుకో లేదని పేర్కొన్నారు. ఇదే విషయమై తల్లిదండ్రులను పిలిచి వారికి చెప్పామని, వారు మరోసారి తప్పు జరగకుండా చూస్తామని, మళ్లీ ఇలాంటి తప్పు చేస్తే రెండు దెబ్బలు వేసి భయం నేర్పమని చెప్పి వెళ్లారని చెప్తున్నారు. విద్యార్థి మళ్లీ తప్పు చేయడంతో మందలించే క్రమంలో కాస్త గట్టిగా దెబ్బ తగిలి ఉండవచ్చని, కానీ తాము విద్యార్థిని కావాలని కొట్ట లేదని పేర్కొన్నారు. విద్యార్థిని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం తాము చేయలేదని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారు.

గొడ్డును బాదినట్టు బాదారన్న విద్యార్థి తల్లిదండ్రులు, పోలీసులకు ఫిర్యాదు
తప్పు చేస్తే మందలించడం, భయ పెట్టడం తప్పు కాదు కానీ, విద్యార్థిని విచక్షణ రహితంగా గొడ్డును బాదినట్లు బాదారని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచక్షణ రహితంగా విద్యార్థిని తిరగబడిన స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు నరసరావుపేట గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దండించవచ్చు కానీ మరీ ఇంత దారుణంగా ప్రవర్తించకూడదు అని వారు అంటున్నారు. విద్యార్థిపై అమానుషంగా ప్రవర్తించిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.