టీడీపీలో చేరాలని దాడి చేస్తున్నారు: జనసేన, హోదాపై పవన్ కళ్యాణ్ మాట మార్చలేదు
అనంతపురం: అనంతపురం జిల్లాలో జనసేన కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆ పార్టీ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. తమ కార్యకర్తలపై దౌర్జన్యం మీద పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు.
ఈ మేరకు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి పేరిట ప్రెస్‌నోట్ విడుదలైంది. ఆ జిల్లాలోని కదిరి పట్టణం, రొద్దం మండలంలో టీడీపీ ఎమ్మెల్యే చాంద్ బాషా.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు చేశారని, అందుకు తమ కార్యకర్తలకు ప్రతి విమర్శ చేయడంతో వారిపై దాడి జరిగిందన్నారు.
తమ పార్టీకి చెందిన 40 మందిపై కదిరి పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు పెట్టించి, వారిని పోలీసులతో తిట్టించారని చెప్పారు.

అదే విధంగా జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలని పెనుకొండ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తన అనుచరులతో తమ కార్యకర్తలపై దాడి చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండు సంఘటనలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రత్యేక హోదాపై పవన్ మాట మార్చలేదు
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట మార్చలేదని మరో ట్వీట్ చేసింది. పవన్ అభిప్రాయాన్ని సదరు న్యూస్ రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications