AP Elections: ఇవాళ ఈసీ ముందుకు మూడు జిల్లాల ఎస్పీలు-వివరణ ఆధారంగా చర్యలు..!
ఏపీలో అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కోడ్ అమల్లోకి వచ్చేసింది. అయినా చాలా చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగిపోతోంది. దీంతో ఈసీ కొరడా ఝళిపించడం మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ఎన్నికల హింస చోటు చేసుకున్న మూడు జిల్లాల ఎస్పీలను ఇవాళ పిలిపిస్తోంది. రాష్ట్ర సచివాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటల లోపు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కావాలని ఆదేశాలు పంపింది.

తాజాగా ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ మూడు ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని మూడు జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. అంతే కాదు నేరుగా హాజరై ఈ వివరణ ఇవ్వాలని ఆదేశాలు పంపింది. దీంతో ప్రకాశం, పల్నాడు, నంద్యాల ఎస్పీలు ఇవాళ సీఈవో ముందు హాజరు కాబోతున్నారు.
హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్ధితుల్లో ఉపేక్షించేంది లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనే స్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలోనూ సీఈవో ముకేష్ కుమార్ ఈ మూడు ఘటనలపై సీరియస్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎస్పీల వివరణలు తీసుకుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపబోతున్నారు. వీటిపై సంతృప్తి చెందితే సరి, లేకపోతే తగు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయన్న అంచనాల నేపథ్యంలో హింస కూడా తప్పదన్న ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications