ఎపి రాజకీయాలపై ఆసక్తి: ముగ్గురు స్టార్లు పోటీ పడుతారా?
చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద పోటీ పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో వారిద్దరికి తోడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో పోటీ పడుతారా...
హైదరాబాద్: ఈ సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. తమ మధ్య పోటీ లేదని చెబుతున్నప్పటికీ ప్రజలు మాత్రం ఏదో మేరకు రెండు సినిమాలను, ఇద్దరు స్టార్లను పోల్చి చూస్తారు. వారిద్దరు రాజకీయాల్లో ఉండడం వల్లనే కాకుండా, సామాజిక వర్గాల దృష్ట్యా కూడా ఆ పోలికలు తేవడం అనివార్యంగా మారుతుంది.
చిరంజీవి సినిమా ఇప్పటికే బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి విషయం గురువారంనాడు గానీ తేలదు. వీరిలో బాలయ్య తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కాగా, చిరంజీవి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు. వారిద్దరు కూడా సినిమాలపై రాజకీయ నీడ లేనట్లుగానే ప్రవర్తిస్తున్నారు. చిరంజీవి రాజకీయాలు కూడా మాట్లాడుతున్నారు గానీ వాటికి అంతగా పదును పెట్టడం లేదు.
ఇక పవన్ కల్యాణ్ విషయానికి వస్తే కాటమరాయుడు సినిమా చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో తన జనసేన పార్టీని పోటీకి దించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ స్థితిలో వచ్చే ఎన్నికలు ముగ్గురు స్టార్ల మధ్య పోటీగా మారుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

చిరంజీవి ఇలా కావచ్చు...
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సారథ్య బాధ్యతలను చిరంజీవికి అప్పగించే అవకాశం లేకపోలేదు. అప్పుడు ఆయన తప్పనిసరిగా బాలకృష్ణను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా, తమ్ముడు పవన్ కల్యాణ్ విషయంలో ఆయన విభేదిస్తున్నారు. తమ్ముడి రాజకీయం విషయంలో ఆయన ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే. తమ్ముడితో రాజకీయాల్లో కలిసి పనిచేసే అవకాశం లేకపోవచ్చునని, అయితే సుదీర్ఘ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఇప్పుడే చెప్పలేమని ఆయన అంటున్నారు.

పెద్ద దిక్కుగా చంద్రబాబు ఉన్నా...
తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అంతా ఆయన చూసుకుంటారు. కానీ తన నియోజకవర్గంలోనే కాకుండా మరి కొన్ని నియోజకవర్గాల్లో బాలకృష్ణ ప్రచారం చేయాల్సి రావచ్చు. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఆయన ప్రచారం చేయాల్సి రావచ్చు. అప్పుడు చిరంజీవితో ఆయన తలపడాల్సే ఉంటుంది.

పవన్ కల్యాణ్ ఏం చేస్తారు...
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ దూకుడుగానే వచ్చే ఎన్నికల్లో వ్యవహరించవచ్చు. ఆయనకు మాస్ ఫాలోయింగ్ పెద్దగానే ఉంది. అయితే, అది చిరంజీవి ఫాలోయింగా అనేది కూడా చూడాల్సి ఉంది. మెగా అభిమానులు మాత్రం చిరంజీవి, పవన్ కల్యాణ్ కలిసిపోవాలని కోరుకుంటున్నారు. కానీ రాజకీయ విభేదాల కారణంగా అది సాధ్యం కాకపోవచ్చు. తాను కాంగ్రెసులోనే ఉంటానని చిరంజీవి చెబుతున్నారు. అయితే రెండు పార్టీల మధ్య ఏదైనా అవగాహన ఉంటుందా అనేది ఇప్పుడు చెప్పడం కష్టమే.

జగన్ ఏం చేస్తారనేది...
చంద్రబాబును ఎదుర్కోవడమే వైయస్ జగన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కావాలని కూడా ఆయన ఆశపడుతున్నారు. ఆయన పార్టీకి రోజా స్టార్ అట్రాక్షన్. అయితే, కాంగ్రెసుకు వైయస్ జగన్ దగ్గరవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బిజెపి చంద్రబాబుతో వెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. అందువల్ల బిజెపి వైపు వెళ్లడానికి జగన్‌కు అవకాశం లేదు. అందువల్ల కాంగ్రెసుతో ఆయన నెయ్యానికి సిద్ధపడుతారా అనేది చూడాల్సిందే..

చిరంజీవితో రోజా ఇంటర్వ్యూ ఓ టాక్...
వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి టీవీ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే కూడా అయిన రోజా చిరంజీవిని ఇంటర్వ్యూ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. రోజా ఇంటర్వ్యూలో కొన్ని రాజకీయపరమైన ప్రశ్నలు ఉన్నప్పటికీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై గానీ, తెలుగుదేశం పార్టీపై గానీ ఏ విధమైన ప్రశ్నలు లేవు. ఆ రకంగా వివాదం నుంచి ఇరువురు కూడా తప్పించుకున్నారు. ఇది సినిమా వరకే పరిమితమవుతుందా, భవిష్యత్తులో కాంగ్రెసు, వైఎస్సార్ కాంగ్రెసు కలిసి పనిచేయడానికి దారి తీస్తుందా అనేది చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications