నివేదిక పంపాం: కోదండరాం, మరో నాటకం: యనమల
హైదరాబాద్: ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను మూడేళ్లకు మించి ఉంచేందుకు వీళ్లేదని, అధికారాల బదలాయింపులు అంగీకరించమని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందానికి(జీవోఎం) 11 అంశాలపై నివేదిక పంపామని తెలిపారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌పై సంపూర్ణ అధికారాలు తెలంగాణకే ఉండాలని కోదండరాం స్పష్టం చేశారు.
ట్రిబ్యునల్ నిబంధనల మేరకే నీటి పంపకాలు జరగాలని, తెలంగాణ ప్రాజెక్టులకు సరిపడా గ్యాస్ ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర విభజనతో పాటు హైకోర్టు విభజనా జరగాలని డిమాండ్ చేశారు. 610జీవో, గిర్‌గ్లానీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఉద్యోగుల విభజన చేయాలని కోదండరామ్ అన్నారు. ఆర్టికల్ 371(డి)ని కొనసాగించాలని ఆయన అన్నారు.

ప్రత్యేక రాష్ట్రంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కోదండరాం చెప్పారు. మిగితా రాష్ట్రాలకు కల్పించే అన్ని హక్కులను తెలంగాణకు కల్పించాలన్నారు. హైదరాబాద్ తోపాటు అన్ని వనరుల వినియోగానికి పరిపూర్ణ అధికారం తెలంగాణకు ఉండాలని కోదండరాం అన్నారు. తెలంగాణ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు రూపకల్పన జరగాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హైకమాండ్‌ది మరో నాటకం: యనమల
సీమాంధ్ర పార్లమెంటు సభ్యుల రాజీనామాలు తిరస్కరించి కాంగ్రెస్ హైకమాండ్ మరో కొత్త నాటకానికి తెర తీసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ఉద్యమ విరమణ తాత్కాలికమే అని అన్నారు. ఇంకా ప్రజల్లో ఉద్యమ ఉద్రేకం ఉందని యనమల రామకృష్ణుడు అన్నారు.












Click it and Unblock the Notifications