పెళ్లి చేసుకుందామన్న ప్రేయసి ఇంటికే కన్నం వేశాడు
హైదరాబాద్: ఓ యువకుడు తనను ప్రేమించిన ప్రియురాలి ఇంటికే కన్నం వేశాడు. ప్రియురాలు తెలిపిన వివరాల మేరకు ఆమెకు తెలియకుండానే తన స్నేహితులతోపాటు పథకం పన్ని ఈ దొంగతనాన్ని పూర్తి చేశాడు ఆ యువకుడు. అయితే దొంగతనంపై ఆ యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దొంగతనానికి పాల్పడిన ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వారి వద్ద నుంచి లక్ష నగదు, 8 తులాల నగలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం రుద్రంపూర్ గ్రామానికి చెందిన ముజీబ్(22), శివ(23), నరేష్(22)లు బీటెక్ పూర్తి చేశారు. వీరు ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. దొంగతనం జరిగిన యజమానురాలు మూడో కుమార్తె ఫోన్‌కు వచ్చిన రాంగ్‌కాల్ ద్వారా ముజీబ్ ఆమెకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత తరచూ ఫోన్ చేసుకుంటూ పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ యువతి ముజీబ్‌ను తన ఇంటికి పిలిచింది. పెళ్లి చేసుకుందాం.. మరి ఎలా జీవించేది అని ముజీబ్ అనడంతో ఆమె తమ ఇంట్లో ఉన్న నగలు, నగదు చూపించింది. దీంతో అతడు చోరీకి ప్రణాళిక వేశాడు.
తన స్నేహితులు శివ, నరేష్‌లతో కలిసి జులై 7వ తేదీన యువతి ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో నగలు విక్రయించేందుకు వచ్చిన ముజీబ్, శివ, నరేశ్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం బయటికి వచ్చింది. ముగ్గుర్నీ అరెస్ట్ చేసిన పోలీసులు, రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications