2019లో టీడీపీ టికెట్లు వాళ్లకే...తేల్చేసిన చంద్రబాబు:ఆ కార్యక్రమాలు ఉంటాయి
అమరావతి: 2019 ఎన్నికల్లో ప్రజామోదం ఉన్నవారికి, గెలిచేవారికి మాత్రమే టికెట్లు ఇస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు.
మంగళవారం టీడీపీ వ్యూహ కమిటీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఎవరు ఎన్ని చెప్పినా వచ్చే ఎన్నికల్లో నిరంతరం ప్రజల్లో ఉండేవారికే పార్టీ తరపున ప్రాధాన్యత ఉండబోతుందని సిఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యేలపై ప్రజాదరణ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని వెల్లడించారు.

వ్యూహ కమిటీతో...చంద్రబాబు
అమరావతిలో మంగళవారం తెలుగు దేశం పార్టీ వ్యూహ కమిటీ నేతలతో సమావేశం అయిన సిఎం చంద్రబాబు ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత కార్యకలాపాలు, 2019 ఎన్నికల వ్యూహాలపై వారితో సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వికాసం, సభ్యత్వ నమోదు కొనసాగుతున్న తీరుతో పాటు బూత్ కన్వీనర్ల శిక్షణ ఎలా సాగుతుందనే వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.

భారీగా...సభ్యత్వ నమోదు
పార్టీ సభ్యత్వ నమోదు 13 రోజుల్లో 8.92 లక్షలకు చేరిందని...ఒకే రోజున అత్యధికంగా 99,183 మంది టిడిపి సభ్యత్వం పొందిన విషయాన్ని ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నేతలకు గుర్తుచేశారు. డిసెంబర్ 15 కల్లా సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ వికాసం గురించి సిఎం చంద్రబాబుకు వ్యూహకమిటీ నిపుణులు వివరిస్తూ ఇప్పటివరకు 6404 గ్రామాల్లో గ్రామ వికాసం కార్యక్రమం జరిగిందని...ఇంకా 10వేల గ్రామాల్లో ఆ కార్యక్రమం జరగాల్సివుందని చెప్పారు.

ఆ సభలు...విజయవంతం చేయండి
దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు మిగిలిన గ్రామాల్లో కూడా ఇదే ఉత్సాహంతో గ్రామవికాసం కార్యక్రమాన్ని కొనసాగించాలని వ్యూహ కమిటీ నిపుణులను ఆదేశించారు. ఈనెల 20న నెల్లూరులో జరిగే ధర్మపోరాట సభను విజయవంతం చేయాలని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని వారికి సూచించారు. అలాగే 27న విజయనగరంలో జరిగే ధర్మపోరాట సభను కూడా విజయవంతం చేయాలని...ఆ తర్వాత శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ధర్మపోరాట సభలు ఉంటాయని వెల్లడించారు.

చివరి సభకు...జాతీయ నేతల హాజరు
చివరగా కృష్ణా-గుంటూరు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ధర్మపోరాట సభ ఉంటుందని చంద్రబాబు తెలిపారు. ఈ చివరి ధర్మపోరాట సభకు జాతీయ పార్టీల నేతలు సైతం హాజరవుతారని వివరించారు. అలాగే ఈనెల 15,16 తేదీల్లో నిర్వహించనున్న 'జయహో బీసీ' వర్క్‌షాప్ అత్యంత ఘనంగా జరిగేలా చూడాలన్నారు. ఈ వర్క్ షాప్ కు బీసీ కులాల నేతలు భారీ సంఖ్యలో తరలివచ్చి సమస్యలపై చర్చించాలని సూచించారు. ఇంకా బీసీలకు ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలపై దిశానిర్దేశం చేయాలన్నారు. అలాగే నియోజకవర్గాలవారీగా టీడీపీ హమారా, దళిత తేజం సభలు కొనసాగుతాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.












Click it and Unblock the Notifications