తిరుమలలో వీఐపీ సిఫారసు లేఖల తిరస్కరణ? 3 నెలల పాటు సిఫారసు లేఖలకు బ్రేక్
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు దృష్ట్యా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటలకుపైగా సమయం పడుతోంది.
శనివారం స్వామి వారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు.33,568 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్‌లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
అయితే తిరమలలో పెరిగిన రద్దీ కారణంగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల రద్దీ అధికంగా ఉండటం వలన ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ప్రభుత్వ విభాగాల సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై టీటీడీ ముందుగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో భక్తులు కుటుంబ సమేతంగా సిఫారసు లేఖలతో తిరుమలకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు.
సాధారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏటా ఏప్రిల్ 15 నుంచి 3 నెలలపాటు సిఫారసు లేఖలను స్వీకరించరు. స్వయంగా వచ్చే VIP ప్రొటోకాల్ పరిధిలోని భక్తులకు మాత్రమే బ్రేక్ కల్పిస్తారు. అయితే ఈ విషయం తెలియకు భక్తులు సిఫారసు లేఖలతో తిరుమలకు చేరుకుని ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

మెరుగైన సౌకర్యాలు..
అయితే వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ లో మెరుగైన వసతులు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. దీన్ని పునర్వ్యవస్థీకరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సీఆర్ఓ కార్యకలాపాలు, అక్కడి పని చేస్తున్న సిబ్బంది, ఇతర అంశాలపై కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, అక్కడున్న పరిమిత స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, సీఆర్ఓ, పీఏసీ 1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై నిర్ణయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications