తిరుమలలో శ్రీవారి భక్తులకు అరుదైన అవకాశం: మధ్యాహ్నం 12 గంటల వరకే దర్శనం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 79,478 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,667 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.05 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంటల్లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- తిరుమలలో ఈ నెల 14వ తేదీన కుమారధార- పసుపుధార తీర్థ ముక్కోటి ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించనుంది టీటీడీ. దీనికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థాన్ని దర్శించుకోవచ్చు.
అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి లేదు. గోగర్భం నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతి ఇస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతి ఉండదు.
పాపవినాశనం నుండి కుమారధార తీర్థం వరకు భద్రతా సిబ్బంది మోహరించనుంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. మార్గమధ్యలో మంచినీరు అందుబాటులో ఉంటుంది. పాపవినాశనం డ్యామ్ వద్ద తెల్లవారు జామున 5 గంటల నుండి భక్తులకు పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, పులిహోర, సాంబారన్నం, పెరుగన్నం అందిస్తారు.
ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేయడానికి అనుమతి లేదు. ఇంజినీంగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తులకు అవసరమైన షెడ్లను వేస్తారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి వీలుగా అంబులెన్స్‌లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోపాటు అవసరమైన మందులను అందుబాటులో ఉంచనున్నారు.
మరోవంక- తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు.
విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో మూడుసార్లు విహరించి భక్తులను కటాక్షించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. మూడవరోజు శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై విహరిస్తారు.












Click it and Unblock the Notifications