తిరుమల శ్రీవారి సన్నిధిలో కొత్త జంట షాకింగ్ పని, వీడియో వైరల్; చర్యలకు డిమాండ్!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాలలో ఒక పెళ్లయిన కొత్త జంట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తులకు టీటీడీ కొన్ని నిబంధనలను అమలు చేస్తున్నప్పటికీ, కొందరు భక్తులు ఆ నిబంధనలు పట్టింపు లేనట్టు వ్యవహరించడం అనేక సందర్భాలలో కనిపిస్తుంది.
తిరుమలలో ఫోటో షూట్ చేసిన కొత్త జంట
తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయడం, ఫోటోషూట్స్ నిర్వహించడం, రీల్స్ చేయడం పైన నిషేధం విధించినప్పటికీ, తాజాగా పెళ్లయిన కొత్త జంట తిరుమల శ్రీవారి ఆలయం ముందు నుదుటిపైన ముద్దులు పెట్టుకుంటూ ఫోటోషూట్ చేయడం వివాదంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పైన నెటిజన్లు మండిపడుతున్నారు.గొల్ల మండపం నుండి అఖిలాండం వరకు ఈ కొత్త జంట వివిధ భంగిమల్లో ఫోటోలు దిగినట్లు సమాచారం.

తిరుమలలో నిషేధం ఉన్నా సరే ఫోటో షూట్ లు
ఈ ఘటన స్థానికులతో పాటు, అనేక ప్రాంతాలలో ఉన్న తిరుమల శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపుతోంది. తిరుమల క్షేత్రంలో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ, వీడియో షూట్లు, సోషల్ మీడియా రీల్స్ చేయడం కఠినంగా నిషేధించిన విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, నూతన దంపతులు ఆలయ పరిసరాల్లో ఫోటోషూట్ నిర్వహించడం ఆలయ సంప్రదాయాలకు, నియమాలకు పూర్తిగా విరుద్ధమని భక్తులు మండిపడుతున్నారు.
భద్రతా సిబ్బందిపై తీవ్ర విమర్శలు
తిరుమల అనేది కేవలం పర్యాటక కేంద్రం కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలకు ప్రతీక అయిన పవిత్ర క్షేత్రమని భక్తులు గుర్తుచేస్తున్నారు. అలాంటి ప్రదేశంలో ఫోటోషూట్లు చేయడం ఆలయ పవిత్రతకు భంగం కలిగించడమే నని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతా సిబ్బందిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమలలో అపచారం… ఫోటో షూట్ పేరుతో ముద్దులు, భక్తుల్లో ఆగ్రహం#Photoshoot #TTD #Tirumala #Tirupati #ViralWatch #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) January 29, 2026
తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఓ కొత్త జంట ఫోటో షూట్ చేయడం వివాదాస్పదమైంది. గొల్లమండపం నుంచి అఖిలాండం వరకు నిషేధిత ప్రాంతాల్లో వీరు… pic.twitter.com/hVR5VDKAAj
ఆలయం ముందే జరుగుతుంటే సిబ్బంది ఏం చేశారు?
సిబ్బంది ఎలా అనుమతిచ్చారని, తిరుమల ఆలయం ముందు ఇంత జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించారా? లేక ప్రత్యేక అనుమతుల పేరిట ఈ ఫోటోషూట్ జరిగిందా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ఘటనకు బాధ్యులైన వారి పైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అలాగే భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసి, పవిత్ర తిరుమలలో ఆలయ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications