తిరుమల శ్రీవారికి నిత్యం 45 ప్రసాదాల నివేదన : ఏ సమయంలో ఏది, ప్రత్యేకతలు..!!
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అందులోనూ శనివారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. రేపు(ఆదివారం) బ్రేక్ దర్శనాలు రద్దు చేసారు. సాలికట్ల బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా.. శ్రీవారిని నిత్యం సమర్పించే నైవేద్యాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఏ సమయంలో ఏది ప్రసాదంగా నివేదిస్తారనేది టీటీడీ భక్తుల కోసం వివరిస్తోంది.
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి ప్రతిరోజూ వివిధ రకాల అన్నప్రసాదాలు, పిండి వంటలు, ఇతర రుచికరమైన పదార్థాలను శాస్త్రోక్తంగా నైవేద్యంగా సమర్పిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో జరిగే నైవేద్య కైంకర్యాల్లో ఆయా సమయాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ప్రసాదాలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. వైఖానస ఆగమ సంప్రదాయా లతో ఆలయ పోటులో నైవేద్య పదార్థాలను అత్యంత పవిత్రతతో, సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. నైవేద్య తయారీలో ఉపయోగించే పదార్థాలు, పాత్రలు, తయారీ విధానాలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. శ్రీవారి నైవేద్యంలో ఎండుమిర్చి, పచ్చిమిర్చిని ఉపయోగించకుండా నల్లమిరియాలను వినియోగించడం ప్రాచీన సంప్రదాయంగా కొనసాగుతోంది. వైఖానస పరిభాషలో భక్తులు పులిహోరగా పిలుచుకునే ప్రసాదాన్ని 'తింత్రిణీరసాన్నం', నెయ్యి పొంగలిని 'ముద్గాన్నం', బెల్లం అన్నాన్ని 'గుడాన్నం', మిరియాల అన్నాన్ని 'మరీచ్యాన్నం', వడను 'మాషాపూపం', దోశను 'చక్రప్పం' అని పిలుస్తారు.

20 రకాల అన్న ప్రసాదాలు
నైవేద్య ప్రియుడైన శ్రీవారికి అనునిత్యం 45 రకాల ప్రసాదాలను నివేదిస్తారు. వీటిలో 20రకాల అన్న ప్రసాద నైవేద్యములు కాగా మిగిలినవి పణ్యారములు కావడం విశేషం. ఆలయంలో మొదటి గంట అనంతరం స్వామివారికి ఉదయం నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో మాత్రాన్నం, ముద్గాన్నం (నెయ్యి పొంగలి), తింత్రిణీరసాన్నం (పులిహోర), దధ్యోదనం (పెరుగన్నం), గుడాన్నం (బెల్లం అన్నం/చక్ర పొంగలి), శాకాన్నం (కదంబం అన్నం), శర్కరాన్నం (రవ్వకేసరి) వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. వీటితో పాటు ప్రతిరోజూ నాలుగు రకాల పణ్యారములు లేదా పిండి వంటలను కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. వీటిలో లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) ఉన్నాయి. రెండో గంట అనంతరం స్వామివారికి మధ్యాహ్న నైవేద్యం లేదా రాజభోగాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు.
అదే విధంగా మూడో గంట అనంతరం రాత్రి నైవేద్యంగా శయనభోగాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాప్పం (వడ), శర్కరాన్నం తదితర ప్రసాదాలను స్వామివారికి సమర్పిస్తారు. సాయంకాల ఆరాధన సమయంలో గర్భాలయాన్ని మరోసారి శుభ్రపరిచి, శ్రీవారిని తాజా పుష్పాలతో అలంకరిస్తారు. సాయంకాల కైంకర్యాల అనంతరం నిర్వహించే శయనభోగంలో భాగంగా అర్ధరాత్రి సమయంలో స్వామివారికి 'తిరువీసం' అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. తిరువీసంలో తెల్ల అన్నంతో పాటు బెల్లంతో తయారు చేసిన తీపి రుచిగల గుడాన్నం ఉంటుంది. రోజులో చివరిగా నిర్వహించే ఏకాంత సేవలో స్వామివారికి వెచ్చని పాలు, కాలానుగుణంగా లభించే ముక్కలుగా కోసిన పండ్లు, నెయ్యిలో వేయించిన ఎండు పండ్లు సమర్పిస్తారు. భక్తులు ప్రసాదంగా స్వీకరించే పులిహోర, పొంగలి, వడ, అప్పం తదితర పదార్థాల వెనుక ఇమిడి ఉన్న ఈ ప్రాచీన వైఖానస ఆగమ సంప్రదాయాలు శ్రీవారి నైవేద్యాల ప్రత్యేకతను మరింతగా తెలియజేస్తున్నాయి.














Click it and Unblock the Notifications
