తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. లడ్డూ వివాదం వేళ ఆ రెండే కీలకమన్న ఈవో!!
తిరుమలలో బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి టిటిడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇక ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయంలో లడ్డు కల్తీ జరిగిన వివాదం కొనసాగుతున్న సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు టీటీడీ ఈవో జే శ్యామలారావు.
శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ ఈవో
స్వామివారి బ్రహ్మోత్సవాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అన్ని విభాగాలు పనిచేయాలని టిటిడి ఈవో ఆదేశించారు. తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో టీటీడీ ఈవో జే శ్యామల రావు, అడిషనల్ ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ శాఖల అధికారులతో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సమీక్షించారు.

తొమ్మిది రోజుల పాటు ఏర్పాట్లపై కీలక ఆదేశాలు
మొత్తం తొమ్మిది రోజులపాటు జరగనున్న ఈ ఉత్సవాల ఏర్పాట్ల పైన శాఖల వారీగా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో వార్షిక బ్రహ్మోత్సవాల తుది సన్నాహక సమావేశాన్ని నేడు నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో జే శ్యామల రావు మాట్లాడుతూ శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యంగా అన్న ప్రసాదం, ఆరోగ్యం, పారిశుధ్యం పైన దృష్టి సారించాలని తెలిపారు.
అన్న ప్రసాదం, ఆరోగ్యం విభాగాలపై ప్రత్యేక శ్రద్ధ
అన్న ప్రసాదం, ఆరోగ్యం విభాగాలపైన రెండు విభాగాలుగా సమన్వయం చేసుకొని భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తిరుమల అన్న ప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే ఆరోగ్య శాఖ దాని పారిశుధ్య కార్మికులతో వెంటనే శుభ్రం చేయించాలని, మరియు ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంలో దృష్టి సారించాలని, తిరుమల పరిసరాలను బ్రహ్మోత్సవాల సమయంలో శుభ్రంగా ఉంచాలని సూచించారు .
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం సమయంలో కీలక ఆదేశాలు
అనంతరం ఇంజనీరింగ్ పనులు, దేవాలయం విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ, గార్డెన్ అండ్ ఫారెస్ట్, డాన్స్ అండ్ భజన బృందాలు, రవాణా, మెడికల్, గోశాల విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవలకు ఈ విభాగాల సేవలను సక్రమంగా వినియోగించుకోవాలని టీటీడీ ఈవో వారికి సూచించారు. తిరుమల ఆలయానికి సంబంధించి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ జరుగుతున్న బ్రహ్మోత్సవాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications