వైభవంగా 'తిరుపతి' నగర పుట్టినరోజు వేడుకలు
893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులవారు గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామివారు కొలువై ఉన్న పుణ్య క్షేత్రం తిరుపతి. ఏ నగరానికి లేని ప్రత్యేక విశిష్టత ఒక్క తిరుపతికే ఉంది. మనుషులు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నట్లే తిరుపతి నగరానికి కూడా ప్రతి సంవత్సరం పుట్టినరోజు వేడుకలు జరుపుతారు. ఒకప్పుడు చిన్న గ్రామంగా వివిధ పేర్లతో పిలవబడి కాలక్రమేణా తిరుపతిగా స్థిరపడింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు శిలాశాసనాలద్వారా మనకు లభించాయి.

ఫిబ్రవరి 24న గోవిందరాజస్వామి ఆలయానికి పునాది
తిరుపతి నగరంగా రూపాంతరం చెందకముందు సౌమ్య నామ సంవత్సరం 24-2-1130 ఉత్తరా నక్షత్ర సోమవరం ఫాల్గుణ పౌర్ణమి రోజు రామానుజులు గోవిందరాజుల పీఠాధిపతిని ప్రతిష్టించి, నిత్య కైంకర్యాలు చేసి నాలుగు మాడ వీధులను అగ్రహారాలతో తిరుపతిని నిర్మించడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధనకు చిహ్నంగా నిలుస్తోంది. ఫిబ్రవరి 24న తన 893వ పుట్టినరోజును జరుపుకోనుంది. 893 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ వైష్ణవ సన్యాసి భగవద్ రామానుజాచార్యులవారు గోవిందరాజ స్వామి ఆలయానికి పునాది వేశారు. ఈ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చారు.

13వ శతాబ్దం నుంచి తిరుపతి అని పిలిచేవారు
రామానుజాచార్యులవారి రాకకు ముందు తిరుపతి, తిరుచానూరులో శ్రీవారి ఉత్సవాలు వైభవంగా జరిగేవి. పండగల కోసం అనేక ప్రాంతాలున్నాయి. ఒక్కో ప్రాంతానిది ఒక్కో విశిష్టత. కానీ నగర స్థాపనకు కచ్చితమైన తేదీ ఉన్నది ఒక్క తిరుపతికే భగవద్ రామానుజాచార్యులవారే తిరుపతి నగరానికి మూలకర్త. అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు పేరు రామానుజపురం అని పేరు పెట్టారు. చాలాకాలం రామానుజపురంగా పిలిచేవారు. అంతకుముందు గోవిందరాజ పట్టణం అని, తర్వాత రామానుజపురం అని, 13వ శతాబ్దం ప్రారంభం నుంచి తిరుపతి అని పిలిచేవారు. ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గతేడాది ఫిబ్రవరి 20న పురాతన శాసనాలను తెప్పించారు. అందులో ఈ నగరానికి 1130 ఫిబ్రవరి 24న రామానుజాచార్యులు శంకుస్థాపన చేసినట్లు రుజువులు దొరికాయి.

గోవిందరాజస్వామి ఆలయంలో వెలుగులోకి..
టీటీడీ ఆధ్వర్యంలోని గోవిందరాజస్వామి ఆలయంలో ఇవి వెలుగులోకి వచ్చాయి. తిరుమలకు ముఖద్వారమైన తిరుపతి లాంటి నగరానికి జన్మదిన వేడుకలు ముఖ్యమని ఎమ్మెల్యే భావిస్తున్నారు. అందుకే ఆధారాలు, శాసనాలు తెప్పించి రెండోసారి పుట్టినరోజు పండగను శుక్రవారం జరుపుతున్నారు. గోవింద రాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, సారె తీసుకుని గోవింద రాజస్వామి ఆలయం లోకి తీసుకు వెళ్లారు. కార్యక్రమంలో ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి తదితరులు గోవింద రాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు












Click it and Unblock the Notifications