AP Results: ఏపీ ఎన్నికల్లో గెలిచేది వారే-కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి జోస్యం..!
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత అధికార, విపక్షాల్లో విజయంపై ఎవరికి వారే ధీమా కనిపిస్తోంది. ఓవైపు అధికార వైసీపీ గత రికార్డు అయిన 151 సీట్లను దాటేస్తామని చెబుతుంటే, విపక్ష కూటమి కూడా 125 సీట్లకు పైగానే సాధిస్తామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు, కూటములకు సంబంధం లేని మరో పార్టీ అభ్యర్ధి, మాజీ కేంద్రమంత్రి ఇవాళ ఏపీలో ఈసారి జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో జోస్యం చెప్పారు.
ఏపీలో ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాబోతోందని తిరుపతి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చింతా మోహన్ జోస్యం చెప్పారు. అదే సమయంలో సీఎం జగన్ తామే గెలుస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు ఇచ్చినా తక్కువే అన్నారు. మరోవైపు తెలంగాణ లో కాంగ్రెస్ కి సీట్లు తగ్గే అవకాశం ఉందని చింతా మోహన్ తెలిపారు. ఎంపీ టిక్కెట్లు కేటాయింపులో సామాజిక సమతుల్యత లోపించిందన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే పని పెట్టుకున్నారని చింతా మోహన్ ఆరోపించారు. ప్రధాని మోదీ స్థాయి దిగజారిపోయిందన్నారు. 10 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క పేదవాడికి కూడా న్యాయం జరగలేదన్నారు. బీజేపీకి 150 సీట్లు మించి రావన్నారు. దక్షిణాదిలో కాంగ్రెస్ కు 100 స్థానాలు వస్తాయని చింతా మోహన్ జోస్యం చెప్పారు. దేశంలో 150 స్థానాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంటుందన్నారు.
ఎన్నికల తరువాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల పాత్ర కీలకం కానుందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ మోడీని ఇంటికి పంపించాలని చూస్తున్నాయన్నారు. ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని చింతా మోహన్ ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో డబ్బు పంపిణీనీ అడ్డుకోలేదన్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఓ జనరల్ స్థానంలో 80 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
గూడూరు ఎస్సీ రిజర్వు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఒక పోలీసు అధికారి స్వయంగా 45 కోట్ల డబ్బు పంపిణీ చేశాడన్నారు. రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ నాలుగైదు వేల కోట్ల రూపాయల ఎన్నికల్లో ఖర్చు చేసిందన్నారు. ఈవీఎంలు మారుస్తారేమోనన్న అనుమానం ఉందని తెలిపారు.












Click it and Unblock the Notifications