తిరుపతి తొక్కిసలాట ఘటనలో మలుపు
Tirupati Stampede: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతిలో టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఏడాది జనవరి 8వ తేదీన తిరుపతి పద్మావతి పార్క్, విష్ణు నివాసంలల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లల్లో సంభవించన ఈ తొక్కిసలాటలో ఆరుమంద దుర్మరణం పాలయ్యారు. 45 మందికి పైగా గాయపడ్డారు.
మృతుల్లో అయిదుమంది మహిళలు ఉన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన బీ నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజిని, లావణ్య, శాంతి, బళ్లారికి చెందిన నిర్మల, సేలం ప్రాంతానికి చెందిన మల్లిక.. ఈ తొక్కిసలాట ఘటనలో మృతి చెందినట్లు అప్పల్లో వార్తలొచ్చాయి. వారందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం 25 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని అందజేసింది.

బాధితులు, మృతుల కుటుంబాల వారిని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రెవెన్యూ- తిరుపతి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఈ తొక్కిసలాట ఘటనపై సమగ్ర విచారణ చేపట్టడానికి చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అదే నెల 22వ తేదీన జీవో జారీ చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ప్రకారం.. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణ మూర్తి సారథ్యంలో దీన్ని అపాయింట్ చేసింది.
నేడు- ఈ కమిషన్ తన విచారణను కొనసాగించనుంది. అప్పట్లో టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేసిన శ్రీధర్ విచారణను ఎదుర్కొననున్నారు. ఈ కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు ఈ విచారణ కొనసాగబోతోంది.
ఈ సందర్భంగా సీవీఎస్ఓ శ్రీధర్‌తో పాటు పలువురు టీటీడీ సిబ్బంది, తిరుపతి జిల్లా పోలీసులు విచారణకు హాజరు కానున్నారు. వారి వాంగ్మూలాలను కమిషన్ రికార్డ్ చేయనుంది. విచారణను ఎదుర్కొంటోన్న వారిలో 42 మంది విజిలెన్స్ ఉద్యోగులు, 32 మంది జిల్లా పోలీసులు ఉన్నారు. వారికి ఇదివరకే కమిషన్ నోటీసులను జారీ చేసింది.












Click it and Unblock the Notifications