ఎపిలో పదింటికల్లా తొలి రిజల్ట్, సిటీలో చార్మినార్‌ది ఫస్ట్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ గురువారం ఉదయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్‌లు, ఎస్పీలతో భన్వర్‌లాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రేపు (శుక్రవారం) సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తొలి ఫలితం రేపు ఉదయం పది గంటలకు తేలనుంది. సాయంత్రం ఆరేడు గంటల వరకు దాదాపు కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను తేల్చడానికి కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేసినట్టు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి సోమేష్ కుమార్ బుధవారం తెలిపారు. కౌంటింగ్ ప్రారంభమైన నాలుగున్నర గంటల్లోగా మొదట చార్మినార్ నియోజకవర్గం ఫలితం వెలువడుతుందన్నారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ల స్థానాలకు సంబంధించిన కౌంటింగ్‌లో చివరి ఫలితం యూకుత్‌పురా నియోజక వర్గానిదని వివరించారు. ఇక్కడ 21 రౌండ్ల కౌంటింగ్ నిర్వహించాల్సి ఉందన్నారు.
కౌంటింగ్ కేంద్రాలో మూడెంచల భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కేంద్ర బలగాలు, పారామిలటరీ దళాలతోపాటూ రాష్ట్ర సివిల్ పోలీసులు సైతం కౌంటింగ్ కేంద్రాల వద్ద రక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. ఈ కేంద్రాల వద్ద ప్రత్యేక అనుమతులున్నా వాహనాలను మాత్రమే అనుమతిస్తారన్నారు. ఆయా నియోజకవర్గాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వారి వారి ఏజెంట్లను ఉదయం 6 గంటల కల్లా కౌంటింగ్ కేంద్రాలకు పంపాలని సూచించారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తి చేసిన తర్వాతే సిబ్బంది ఈవీఎంలను చూస్తారన్నారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ పూర్తి చేయడానికి కనీసం 20 నిమిషాలు పడుతుందన్నారు. కౌంటింగ్ కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన పరిశీలకులకు ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేస్తామన్నారు. కాగా జిల్లాలో ఎన్నికల నిర్వహణకు రూ.23 కోట్లు వ్యయమైందని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.17 కోట్లు ఎన్నికల సంఘం చెల్లించిందని మిగిలిన రూ.6 కోట్లు సైతం త్వరలో జీహెచ్ఎంసీ ఖాతాలో చేరుతాయన్నారు.

సార్వత్రిక ఎన్నికలు
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తొలి ఫలితం శుక్రవారం ఉదయం పదిగంటలకల్లా వెలువడే అవకాశముందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ బుధవారం చెప్పారు. అదే రోజు సాయంత్రం నాలుగైదు గంటలకల్లా శాసన సభ, లోకసభ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు.

సార్వత్రిక ఎన్నికలు
సార్వత్రిక ఎన్నికల తుది ఘట్టానికి ఓట్ల లెక్కింపు పర్వానికి ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు.

సార్వత్రిక ఎన్నికలు
రాష్ట్రంలోని 294 అసెంబ్లీ, 42 లోకసభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుకు పలు ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరిశీలకులను నియమించారు.

సార్వత్రిక ఎన్నికలు
మల్కాజిగిరి పార్లమెంటు మరియు కంటోన్మెంట్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం సికింద్రాబాదులోని వెస్లీ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన దృశ్యం.












Click it and Unblock the Notifications