బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం
దక్షిణ అండమాన్ సమీపంలో నవంబర్ 27న అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది ఈనెల 29 నాటికి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంవల్ల కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఆరు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య రుతుపవనాల నేపథ్యంలో థాయ్‌లాండ్ మీదుగా వచ్చే ఉపరితల ఆవర్తనం ఆదివారం దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించనుంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఈ నెల 29 నాటికి వాయుగుండంగా బలపడనుంది. బంగ్లాదేశ్ దిశగా పయనించే సమయంలో తుఫాన్ ఉత్తర బంగాళాఖాతంలోకి ప్రవేశించి బలహీన పడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను దక్షిణ కోస్తా... తమిళనాడుకు సమీపంగా వచ్చి దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు వెళుతుందని అంచనా వేస్తున్నారు. దీనివల్ల 26 నుంచి 28వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. మత్స్యకారులు 29 వరకు చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వరి, పత్తికి కొద్దిగా నష్టం వాటిల్లింది. వరి పైరు కోసి.. నూర్చి ఆరబోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని పత్తి పొలాల్లో తీయాల్సిన పత్తి కూడా తడిసిపోయింది. ప్రస్తుత వర్షాలు వరి, పత్తి రైతులకు నష్టం చేస్తుండగా.. ఇతర పంటలకు మాత్రం బాగా ఉపయోగపడుతున్నాయి. గతవారం బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడినా పెద్దగా ప్రభావం లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications