XXX: సంస్కారవంతమైన సోప్స్ అధినేత ఇక లేరు
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ (77) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం సాయంత్రం గుంటూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం నిర్వహించారు.
1947లో ట్యూటికోరిన్‌లో మాణిక్యవేల్ జన్మించారు. ఆ తర్వాత తమిళనాడు నుంచి 1980లో గుంటూరు వచ్చిన అరుణాచలం మాణిక్యవేల్.. సబ్బుల వ్యాపారం ప్రారంభించారు. తాను తయారు చేసిన సబ్బులను రిక్షాలో పెట్టుకుని ఇంటింటికీ తిరిగి విక్రయిస్తూ ఒక్కోమెట్టూ ఎక్కారు. ప్రకటనలకు ప్రాముఖ్యం ఉందని గ్రహించిన మాణిక్యవేల్.. బహుళ ప్రజాదరణ పొందిన సినిమా పాటల పల్లవులను ప్రచారానికి వాడారు.

అందరికీ శుభం కలుగుగాక, సంస్కారవంతమైన సోప్ లాంటి నినాదాలను ఉపయోగించారు. నాలుగు దశాబ్దాలుగా ట్రిపుల్ ఎక్స్ సోప్ బ్రాండ్‌ను ఊరురా మారుమోగేలా చేసి గొప్ప వ్యాపార సామ్రాజాన్ని ఆయన నిర్మించారు. గుంటూరులోని పలు సాంస్కృతిక, సేవా సంస్థలు, తమిళ సంఘాలకు మాణిక్యవేల్ చేయూత అందించారు. వ్యాపారవేత్తగానే గాక, గొప్ప మానవతా వాదిగా పేర సంపాదించారు.
250 రూపాయల నగదును జేబులో పెట్టుకుని గుంటూరుకు వచ్చిన మాణిక్యవేల్.. ట్రిపుల్ ఎక్స్ సబ్బుల వ్యాపారం చేస్తూ వందల కోట్ల టర్నోర్ కంపెనీకి యజమాని అయ్యారు. 2 వేల మంది కుటుంబాలకు ఆయన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ట్రిపుల్ ఎక్స్ సోప్స్ కంపెనీకి మాణిక్యవేల్ భార్య మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆయన కొడుకు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. వందల రూపాయలతో వచ్చి వంద కోట్ల విలువ చేసే పరిశ్రమగా ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఇండస్ట్రీని తీర్చిద్దిన అరుణాచలం మాణిక్యేల్ ఆదర్శంగా నిలిచారు.












Click it and Unblock the Notifications