వీరిని కూడా పరామర్శించాలని డిమాండ్: షర్మిలకు తెలంగాణ షాక్
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో పరామర్స యాత్ర చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరికి తెలంగాణవాదులు షాకిచ్చారు. గురువారం నాడు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
షర్మిల రెండోరోజు పరామర్శ యాత్రలో భాగంగా కాలనీలోని వెంకటనర్సయ్య అనే వైయస్ రాజశేఖర రెడ్డి అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బయటకు వచ్చారు. షర్మిలను తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అడ్డుకున్నారు.

షర్మిలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ కోసం చనిపోయిన అమరవీరుల కుటుంబాలను కూడా షర్మిల పరామర్శించాలని డిమాండ్ చేశారు. లేదంటే యాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. దీంతో తెరాస, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. అనంతరం యాత్ర కొనసాగింది.
కాగా, షర్మిల పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం జిల్లాలో ఆమె పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందని ద్రాక్షలా మారాయన్నారు. వైయస్ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా జీవించారని చెప్పారు.
మళ్లీ అలాంటి పాలన కోసం పేద ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. కాగా, నల్గొండ జిల్లా హిల్‌కాలనీలో షర్మిల యాత్రను తెరాస కార్యకర్తలు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications