కీలుబొమ్మ: మందకృష్ణపై తెరాస దళిత ఎమ్మెల్యేలు భగ్గు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేతిలో మందకృష్ణ మాదిగ ఓ కీలు బొమ్మ అని తెరాస నేత టి.రాజయ్య ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి మందకృష్ణ అనుకూలంగా పనిచేస్తారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. మందకృష్ణ అవకాశవాద రాజకీయాలను వదిలి దళితుల హక్కుల కోసం పోరాడాలని టి.రాజయ్య హితవు చేశారు.
మందకృష్ణ మాదిగపై తెరాస శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, రసమయి బాలకిషన్ కూడా మండిపడ్డారు. మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడి చేతిలో కీలుబొమ్మ అని వారు వ్యాఖ్యానించారు. దళిత ఎమ్మెల్యేలు దొరల తొత్తులు అంటూ వ్యాఖ్యానించిందుకు మందకృష్ణ జాతికి క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
మందకృష్ణ నియంతృత్వ ధోరణి వల్ల మాదిగ నేతలంతా ఎమ్మార్పీయస్‌ను వీడుతున్నారని వారు గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేసినా మందకృష్ణ మాదిక విజయం సాధించలేదని వారన్నారు. దళిత సామాజిక న్యాయం తెరాసతోనే సాధ్యమని వారు చెప్పారు. తెలంగాణలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications