కాంగ్రెసులో తెరాస విలీనం: కెసిఆర్ కోర్కెల చిట్టా
హైదరాబాద్: కాంగ్రెసులో తమ పార్టీ విలీనమయ్యే సమస్యే లేదని పార్టీ సమావేశంలో చెప్పిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షడు కె. చంద్రశేఖరరావు కేంద్ర మంత్రుల బృందం (జివోఎం)తో భేటీ తర్వాత మాట మార్చారు. తాను కాంగ్రెసులో పార్టీని విలీనం చేయబోనని చెప్పలేదని చెప్పారు. కెసిఆర్ కాంగ్రెసులో పార్టీ విలీనంపై దోబూచులాట ఆడుతున్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాత విలీనం గురించి ఆలోచన చేస్తానని ఆయన మొదటి నుండీ చెబుతూనే వస్తున్నారు. ఐతే విలీనానికి ఆయన కాంగ్రెసు ముందు తన కోర్కెల చిట్టా విపినట్లు తెలుస్తోంది.
జీవోఎంతో సమావేశం తర్వాత కేంద్ర మంత్రులు ఆంటోనీ, సుశీల్ కుమార్ షిండేలతో బిల్లు, విలీనం విషయమై కెసిఆర్‌తో విడిగా మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. నేను చెప్పింది మీరు బిల్లులో పెడితే, మీరు చెప్పింది నేను చేస్తాను అని వారికి కెసిఆర్ చెప్పినట్లు తెలుస్తోంది. ఎటువంటి ఆంక్షలు లేకుండా హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేసే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల సమాచారం. కానీ హైదరాబాద్‌పై మెలిక పెడితే మాత్రం తాను విలీనానికి దూరంగా ఉంటానని చెప్పనట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

జివోఎంతో భేటీ ముగిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత విలీనం గురించి ఆలోచిస్తానని ఆయన స్పష్టంగా మీడియా ప్రతినిధులతో చెప్పారు. విలీనం వార్తలను ఆయన ఖండించలేదు. పైగా, తాము విలీనం చేయబోనని చెప్పలేదని వివరణ ఇచ్చారు.
ఆయన జివోఎం ముందు డిమాండ్లను స్పష్టంగా వినిపించిటన్లు తెలుస్తోంది. హైదరాబాదుపై తెలంగాణ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలు ఇవ్వాల్సిందేనని, ఎటువంటి ఆంక్షలు లేని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన కోరినట్లు సమాచారం. హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ఆదాయంలో వాటాల పంపిణీ వద్దని, తెలంగాణ ప్రభుత్వ అధికారాలకు కోత విధించకూడదని, ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఐదేళ్ల పాటు మాత్రమే ఉంచాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
మిగిలిన 28 రాష్ట్రాలతో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయో అలాగే తెలంగాణతో కొనసాగించాలని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నేతృత్వంలోని ట్రిబ్యునల్ మాత్రమే జలవనరుల పంపిణీని చూడాలని, హైదరాబాద్‌పై ఎవరికీ ప్రత్యేక హక్కులు దాఖలు చేయకూడదని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి పరిస్థితిలోనే కాంగ్రెసులో తన పార్టీని విలీనం చేసే విషయంపై ఆలోచన చేస్తానని ఆయన కేంద్ర మంత్రులు ఆంటోనీకి, షిండేకు చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications