• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బంగారు టీని ముద్దాడే వరకు..: కెసిఆర్, బాబుపై పరోక్షంగా..

By Pratap
|

హైదరాబాద్: అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సమావేశం శుక్రవారం ఉదయం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పార్టీ ప్లీనరీ కావడంతో హంగులూ ఆర్భాటాలూ ఎక్కువే చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ అధ్యక్షోపన్యాసంలో కాంగ్రెసు నాయకులపై ధాటిగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై పేరు ప్రస్తావించకుండా ఆ పార్టీ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. కాంగ్రెసును ఆయన ఎక్కువ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపించారు.

TRS plenary at LB stadium in Hyderabad

కెజి టు పిజీ ఉచిత విద్యపై చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని కెసిఆర్ చెప్పారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువేనని కెసిఆర్ అన్నారు. తాను వేరే పార్టీలో పనిచేశానని, సభ్యత్వ రుసుం నాయకులు కట్టేవారని, కానీ కార్యకర్తలే రుసుం కట్టారని 50 లక్షల నుంచి కార్యకర్తలకు రెండేసి లక్షల రూపాయలు వెంటనే ఇస్తామని ఆయన చెప్పారు

కెసిఆర్ మాట ఇస్తే తల తెగి పడినా వెనక్కి తగ్గేది లేదని, నిరుద్యోగులు నిరాశపడాల్సిన అవసరం లేదని, ఉద్యోగాలు కల్పిస్తామని, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని, ఉద్యోగుల విభజన జరిగిన వెంటనే అది జరుగుతుందని, లక్ష మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. స్వర్ణయుగం వైపు, బంగారు తెలంగాణ వైపు అడుగులు వేస్తామని తాను రాసిన పాట చరణాలు చదివి వినిపించి చెప్పారు.

TRS plenary at LB stadium in Hyderabad

టిఆర్ఎస్ పది కోట్ల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిందని, 50 లక్షల రూపాయలు కార్యకర్తలకు బీమాగా డిపాజిట్ చేశామని ఆయన చెప్పారు. కార్యకర్తలందరికీ పదవులు వస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకే తన జీవితం అంకితమని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ గమ్యాన్ని ముద్దాడే వరకు పోరాటం సాగిద్దామని ఆయన పిలుపునిచ్చారు.

హైటెక్కు సిటీని నేనే కట్టానని ఒకరంటారు, హైదరాబాదును నేనే కట్టినా అని మరొకరు అంటారని, హైదరాబాదులో అశాస్త్రీయంగా నిర్మాణాలు చేశారని కెసిఆర్ అన్నారు. ఆ రకంగా కెసిఆర్ చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా తీవ్ర వ్యాఖ్య చేశారు.

అపార్థాలు సృష్టించే పత్రికలు ఇంకా ఉన్నాయని, ప్రాణహిత - చేవెళ్లను రద్దుచేసుకుంటున్నట్లు రాశాయని, దాన్ని రద్దు చేయలేదని, కాస్తా డిజైన్ మారుస్తున్నామని, తాను కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేయిస్తానని కెసిఆర్ అన్నారు. తెలంగాణలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను వచ్చే నాలుగైదేళ్లలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.

TRS plenary at LB stadium in Hyderabad

ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఓట్లు అడగడానికి కూడా రాబోమని చెప్పిన ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ తమదని కెసిఆర్ అన్నారు. తెలంగాణ ఎలా పట్టుబట్టి తెచ్చామో, 20 వేల కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ నిర్మిస్తున్నామని ఆయన చెప్పారు.

కాంగ్రెసు నాయకులకు సిగ్గూ లజ్జ లేదని ఆయన అన్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు 8 కోట్ల రూపాయలతో చేసేదే అయితే పదేళ్లు మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు చేయలేదని ఆయన అన్నారు. నాలుగేళ్లలో వాటర్ గ్రిడ్ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. 6,500 కోట్ల భారమైనా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చామని ఆయన చెప్పారు.

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని కెసిఆర్ చెప్పారు. అంగన్ వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించారని, తాము వారు అడగకుండానే వారి సమస్యలను తీర్చామని, ఎన్నికల సమయంలో మాత్రమే కాంగ్రెసుకు ప్రజలు గుర్తుకు వస్తారని కెసిఆర్ అన్నారు. తమ పాలన చూసి కాంగ్రెసు నేతల కాళ్ల కిందికి నీళ్లు వస్తున్నాయని ఆయన అన్నారు.

TRS plenary at LB stadium in Hyderabad

91,500 కోట్ల రూపాయలు విద్యుత్తుకు సమకూర్చుకున్నామని, తన తెలంగాణ ప్రజలే తనకు బాస్‌లని, మరెవరూ లేరని ఆయన అన్నారు. హాస్టళ్లలో సన్న బియ్యం పెట్టాలనే ఆలోచన కాంగ్రెసుకు ఎందుకు రాలేదని ఆయన అడిగారు. కరెంట్ కోతలకు కారణమైనవారే ఎత్తేయాలని అనడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. తెలంగాణకు కరెంట్ పీడ పోయిందని, కోతలు ఉండవని ఆయన అన్నారు.

తెలంగాణ ఆగమైపోతుందని ఆనాటి కాంగ్రెసు ముఖ్యమంత్రి అన్నారని, వారికి ఇప్పుడు తాము చేసి చూపిస్తున్నామని, కాలమైంది కరెంట్ కష్టం రాలేదని, పంటలను ఎండబెట్టుకోలేదని ఆయన అన్నారు. బయట ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణకు రావాలని, కరెంటూ నీళ్లూ ఉన్నాయని ఆయన చెప్పారు. వచ్చే రోజుల్లో తమ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి నేటి కరెంట్ సరఫరానే నిదర్శనమని ఆయన అన్నారు.

ఒక్క చెరువుల తట్టెడు మట్టి తీశారా, మీరు నిజంగా తెలంగాణ బిడ్డలే అయితే ఆనాటి పాలకుల తలలు ఎందుకు వంచలేదు, మీరు చేయలేదు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తిరిగి ప్రాణం పోస్తున్నామని ఆయన అన్నారు. కాకతీయ రెడ్డి రాజులు, గొల్కొండ నిజాములు కూడా చెరువుల వ్యవస్థను ఏర్పాటుచేసి పరిరక్షించారని ఆయన అన్నారు.

రైతు రుణాల మాఫీ చేస్తున్నామని ఆయన చెప్పారు. గత కాంగ్రెసు ప్రభుత్వం నష్టపరిహారాల బకాయిలు 480 కోట్ల రూపాయలు ఉన్నాయని, వాటిని చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. ఫార్మాసిటీ, ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ ఎక్కడ రావాలనే విషయాలపై మాట్లాడామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసిలకు, రైతులకు అందిస్తున్న సహాయాలను, పథకాలను ఆయన వివరించారు. తెలంగాణ మొత్తమే బలహీనవర్గాల రాష్ట్రం కాబట్టి అన్ని వర్గాల సంక్షేమాన్ని తమ ప్రభుత్వం చూస్తుందని ఆయన అన్నారు.

TRS plenary at LB stadium in Hyderabad

మహబూబ్ నగర్ లో అవాకులు చెవాకులు పేలినవాళ్లను అడుగుతున్నా, కాంగ్రెసును అడుగుతున్నా, 50 ఏళ్లు మీరే పాలించారని, బీడీ కార్మికులకు ఏమీ చేయలేదని, ఎవరూ అడగకుండానే వేయి రూపాయల పింఛను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడిన విషయాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అశాస్ట్రియమైన భూపంపిణీ చేశారని ఆయన అన్నారు.

34 లక్షల మంది రైతు రుణమాఫీ చేసిన ఘనత తమదేనని ఆయన అన్నారు. భూస్వాములు కొందరు దళితులకు పంచడానికి భూములు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నారై మిత్రులు, భూస్వాములు, హైదరాబాద్ వ్యాపారులు భూములు ఇవ్వాలని, ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు 2,405 ఎకరాలు పంపిణీ చేశామని ఆయన చెప్పారు.

తెలంగాణ వచ్చిన తర్వాత సాంస్కృతిక పునరజ్జీవనం జరుగుతోందని కెసిఆర్ అన్నారు. మనం కూడా సన్నాసుల్లాగా వెళ్లి ఆంధ్రలో పుణ్యస్నానాలు చేసేవాళ్లమని, తెలంగాణలో గోదావరి ఎక్కువ ప్రాంతంలో ప్రవహిస్తుందని, గోదావరి పుష్కరాలు తెలంగాణలో జరగాలా, ఆంధ్రలో జరగాలా అని వాదనకు దిగానని ఆయన అన్నారు.

మళ్లీ పుష్కరంలోపల తెలంగాణను ఏర్పాటు చేయాలని అని గోదావరి తల్లిని కోరుకున్నానని, ఈ పుష్కరం వచ్చేసరికి తెలంగాణ సాకారమైందని ఆయన అన్నారు. సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేస్తున్నామని ఆయన అన్నారు.

అనేక నిర్బంధాలు, జైళ్లు, లాఠీచార్జీలు జరిగినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్ర అధ్భుతాన్ని అవిష్కరించిన ఘనత టిఆర్ఎస్ కార్యకర్తలదేనని, ఈ ఘనత ఇతరులెవరికీ దక్కదని, టిఆర్ఎస్ కార్యకర్తల చరిత్ర శాశ్వతంగా ఉంటుందని కెసిఆర్ అన్నారు. ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. తాను ఒక్కడినే ప్రారంభమయ్యాయని, తర్వాత ఒక్కరొక్కరే చేతులు కలుపుతూ వచ్చారని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆరోపణలు వచ్చినా ఉద్యమ బాటను వదిలిపెట్టలేదని, దాంతోనే తెలంగాణ కల సాకారమైందని ఆయన అన్నారు.

కొంత మంది మనకన్నా ఎక్కువ తెలంగాణ జెండా పెట్టి ఎగిరారని, వారు కనిపించకుండా పోయారని ఆయన అన్నారు. ఎవరు సలహా ఇచ్చినా తీసుకుని ముందుకు సాగామని ఆయన అన్నారు. కళాకారుల సభలో 14 ఏళ్ల అనుభవాలు గుర్తుకు వచ్చి కళ్లలో నీళ్లు వచ్చాయని ఆయన అన్నారు.

అమరవీరుల కుటుంబాలను తన కుటుంబంగా కాపాడుకుంటానని ఆయన చెప్పారు. కొమురం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామంటే కాంగ్రెసు ప్రభుత్వం జరగనివ్వలేదని, కొమురం భీమ్‌కు సెల్యూట్ చేసి, స్మారకానికి ప్రారంభం చేశానని ఆయన చెప్పారు. ప్రపంచమే అబ్బుర పడే విధంగా నిర్మాణం జరుగుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ బిడ్డ పివిని కాంగ్రెసు పార్టీ గౌరవించలేదని, మనం గౌరవించుకోవడమే కాకుండా ఉత్సవాలు నిర్వహించామని ఆయన చెప్పారు. పివి, దాశరథి, కాళోజీ పేరిట అనేక కార్యక్రమాలను చేసుకుంటున్నామని ఆయన అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టీకల్చర్ యూనివర్శిటీ పెట్టుకున్నామని ఆయన చెప్పారు.

టిఆర్ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రకటించారు. కెసిఆర్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందించారు. పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్ ఎన్నిక కావడం ఇది ఎనిమిదో సారి.

ఎల్బీస్టేడియంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్లీనరీకి వచ్చే 50 వేల మంది ప్రతినిధుల కోసం భోజన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తైనట్లు తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీరు, చల్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

TRS plenary at LB stadium in Hyderabad

కేసీఆర్ జయుడు..టీఆర్‌ఎస్ అజేయమైందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. పార్టీ ప్లీనరీ కార్యక్రమంలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ఉద్యమంలో పాల్గొని గెలిసొచ్చిన వీరులు టీఆర్‌ఎస్ కార్యకర్తలని అన్నారు. అంతకు ముందు జ్యోతిని వెలిగించి కెసిఆర్ సమావేశాలను ప్రారంభించారు.

ప్రజల సంక్షేమం, అభివృద్ధిపై టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో చర్చించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యాక్రమాలపై భేటీలో విస్తృతంగా చర్చ జరుగుతదని పేర్కొన్నారు. అదేవిధంగా రాబోయే నాలుగేళ్లలో తెలంగాణ ముఖచిత్రం ఎలా ఉండాలనేదానిపై ప్లీనరిలో చర్చిస్తమని ఆయన వెల్లడించారు.తెలంగాణ మట్టి బిడ్డలు టీఆర్‌ఎస్ కార్యకర్తలని చెప్పారు. 14 ఏళ్ల ఉద్యమం చేసిన టీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఉద్యమ సెల్యూట్ చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana CM K Chandrasekhar rao lead Telangana rastra Samithi plenary held at LB statdium in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more